Meenakshi Chaudhary | “మట్కా’ చిత్రంలో సుజాత అనే అమాయకమైన అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. మూడు భిన్నమైన కాల వ్యవధుల్లో నా క్యారెక్టర్ సాగుతుంది. ఒక జీవిత ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ ఎమోషనల్‌గా ఉంటుంది’ అని చెప్పింది మీనాక్షి చౌదరి. ఇటీవల విడుదలైన ‘లక్కీ భాస్కర్’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ భామ తాజాగా ‘మట్కా’ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నది. వరుణ్‌తేజ్ హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొస్తున్నది.
ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ ‘ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. ‘లక్కీ భాస్కర్’ విజయం సాధించింది. ఇప్పుడు ‘మట్కా’ విడుదలకానుంది. ఇదే నెలలో ‘మెకానిక్ రాకీ’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇలా ఒకే నెలలో మూడు చిత్రాలు రావడం స్పెషల్ మూమెంట్‌గా భావిస్తున్నా’ అని చెప్పింది. ‘మట్కా’ సినిమాలో తాను పోషించిన సుజాత పాత్ర గురించి మాట్లాడుతూ ‘తను ఎప్పుడు ఆశావహదృక్పథంతో కనిపిస్తుంది. హీరో వాసు జీవితంలో ఓ వెలుగులా ఉంటుంది. ప్రతీ అమ్మా యి నా పాత్రతో కనెక్ట్ అవుతుంది.
ముఖ్యంగా భిన్న కాలాల్లో నా పాత్ర పరివర్తన చెందే తీరు ఆసక్తికరంగా అనిపిస్తుంది. యుక్త వయస్సు పాత్రలో వింటేజ్ లుక్‌లో కనిపిస్తాను. ఆ తర్వాత జీవితంలోని దశలు మారేకొద్ది నా లుక్స్ మారుతుంటాయి. ఇది పీరియాడిక్ డ్రామా కాబట్టి ఈ సినిమా విషయంలో చాలా హోమ్‌వర్క్ చేశాను’ అని చెప్పింది. నటిగా అన్ని జోనర్స్ ఇష్టమేనని, ప్రేక్షకులకు గుర్తుండిపోయే బలమైన పాత్రలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నానని మీనాక్షి చౌదరి పేర్కొంది.