Salaar | పాన్ ఇండియన్ సినిమా అంటేనే ప్రమోషన్ బాగా గట్టిగా చేసుకోవాలి అని అర్థం. మరి రూ.300 కోట్లతో తెరకెక్కిస్తున్న సినిమాకు ప్రమోషన్స్ ఇంకెంత బలంగా ఉండాలి..? కానీ ప్రభాస్ సలార్ సినిమా ప్రమోషన్స్ గురించి మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు దర్శక నిర్మాతలు. ఈ సినిమా రిలీజ్ డేట్ మరో 10 రోజుల్లోనే ఉన్నా కూడా ఎందుకో మరి సినిమాను పెద్దగా ప్రమోట్ చేయడం లేదు. ప్రభాస్ కూడా ప్రమోషన్స్‌కు వచ్చేలా కనిపించడం లేదు. ప్రశాంత్ నీల్ హాయిగా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. సలార్‌కు పోటీగా వస్తున్న డంకీకి మాత్రం ఫుల్ రేంజ్ ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఆ సినిమా నుంచి 4 పాటలు, ట్రైలర్ వచ్చేశాయి. వీటికి రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. కానీ సలార్ నుంచి ట్రైలర్ తప్పిస్తే మరోటి రాలేదు. ప్రీ రిలీజ్ వేడుక కూడా చేస్తారనే గ్యారెంటీ అయితే లేదు.
ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రమోషన్ చేసుకోవడమే కష్టం అనుకుంటే.. ప్రీ రిలీజ్ ఏర్పాటు చేయడం దాదాపు అసాధ్యం. దానికితోడు ప్రభాస్ కూడా ప్రీ రిలీజ్ వేడుకపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది. అందుకే దర్శక నిర్మాతలు కూడా కేవలం సోషల్ మీడియా ప్రమోషన్‌తోనే పని కానిచ్చేయాలని చూస్తున్నారు. కాకపోతే ఇంత జరిగినా కూడా గల్లీ టూ ఢిల్లీ వరకు డంకీ కంటే ముందు సలార్ ఉన్నాడు. ఓవర్సీస్లో అయితే ఈ సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్‌కు రంగం సిద్ధమైపోయింది. ముఖ్యంగా సలార్ సినిమాపై ఇండియాలోనే కాదు.. ఓవర్సీస్లోనూ అదే స్థాయి అంచనాలున్నాయి. ఇప్పటికే అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ ఈ చిత్రానికి అదిరిపోయే స్పందన వస్తుంది. అమెరికాలో 347 లొకేషన్లలో బుకింగ్స్ ఓపెన్ అయితే.. ఇప్పటికే 6 లక్షల డాలర్ల వరకు వసూలు చేసింది సలార్. అదే సమయంలో షారుక్ ఖాన్ డుంకీ మాత్రం 328 లొకేషన్లలో కేవలం 90 వేల డాలర్లను వసూలు చేసింది.
దీన్నిబట్టి ప్రభాస్ డామినేషన్ ఎలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. దీనికి సరైన ప్రమోషన్ కూడా తోడైతే సినిమా దుమ్ము లేపడం ఖాయం. కానీ ప్రమోషన్స్ మాత్రం నో అంటున్నారు మేకర్స్. ఉన్నదే చాలులే అన్నట్లు వాళ్లున్నారు. సలార్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. ఇవన్నీ ఏవీ లెక్కలోకి రావు.. అన్నీ కలెక్షన్లలోనే తెలుస్తాయి. కానీ ఏదైనా తేడా కొడితే మాత్రం కర్ణుడి చావుకు లక్ష కారణాలన్నట్లు.. సినిమా ఫెయిల్యూర్‌కు ఇవన్నీ కారణాలే అవుతాయి. ఏదేమైనా రిలీజ్‌కు మరో 10 రోజుల సమయం ఉండటంతో సలార్ మేకర్స్ ఏం చేస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారిందిప్పుడు. ప్రీ రిలీజ్ లేదని చెప్తున్నా కూడా కచ్చితంగా పెట్టాల్సిందే అనేది అభిమానులు అడుగుతున్న మాట. మరి వాళ్ల అభిప్రాయాన్ని దర్శక నిర్మాతలు లెక్కలోకి తీసుకుంటారా లేదా అనేది చూడాలిక.