Spirit | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’ పై దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ అయింది. దానికి ప్రధాన కారణం ఈ చిత్రానికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కావడం. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి మూడు సినిమాలతోనే స్టార్ డైరెక్టర్ల జాబితాలోకి చేరిన సందీప్, ఆయన ప్రత్యేకమైన వైలెంట్ స్టోరీటెల్లింగ్ స్టైలుతో అందరి దృష్టిని ఆకర్షించాడు . మరి అలాంటి దర్శకుడు ప్రభాస్‌తో సినిమా చేస్తే ఎలా ఉంటుందన్న ఆసక్తి అభిమానుల్లో రెట్టింపైంది. అయితే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తోన్న ‘స్పిరిట్’ ఎట్టకేలకు అధికారికంగా మొదలైంది.
నవంబర్ 23న సందీప్ రెడ్డి వంగా ఆఫీస్‌లో పూజా కార్యక్రమాలు జరగగా, ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ కార్యక్రమానికి ప్రభాస్ హాజరు కాకపోవడం అభిమానుల్లో నిరాశను కలిగించింది. ఓపెనింగ్‌కు హీరో కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో కొందరు ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ప్రస్తుతం ఇండియాలో లేరు. కొన్ని రోజుల క్రితమే ఒక ముఖ్యమైన పని మీద జపాన్ వెళ్లారని, అందుకే ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని తెలుస్తోంది.
స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ప్రభాస్ తన కెరీర్లో తొలిసారి వైలెంట్ పాత్ర పోషించబోతున్నాడట. ఇటీవల ఆయనకు సంబంధించిన లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని సమాచారం. షూటింగ్ ప్లాన్స్, స్క్రిప్ట్ వర్క్స్ దృష్ట్యా, ‘స్పిరిట్’ 2027 సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రావచ్చని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. ప్రభాస్–సందీప్ రెడ్డి వంగా కాంబోతో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ రికార్డులు సృష్టించే అవకాశం ఉందని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.