Sekhar Kammula| అందమైన ప్రేమ కథలని చాలా హృద్యంగా చూపించే దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు. ఆయన తీసిన సినిమాలని ఎన్నిసార్లు చూసిన బోర్ అనే ఫీలింగ్ కలుగదు. ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, ఫిదా, లవ్ స్టోరీ వంటి సినిమాలు ప్రేక్షకులని ఎంతగానో మెప్పించాయి. ఇప్పుడు ధనుష్ సినిమాతో బిజీగా ఉన్నాడు శేఖర్ కమ్ముల. అయితే తన సినిమాలలో ఏదో ఒక సందేశం మనం చూస్తూ ఉంటాం. సమాజంపై చెడు ప్రభావం కనిపించకుండా తెరకెక్కిస్తుంటారు. కాకపోతే ఆయన సినిమాలు చాలా లేట్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. దానికి తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర సమాధానం ఇచ్చారు శేఖర్ కమ్ముల.
నా దృష్టిలో సినిమా అంటే బాధ్యతాయుతం అయిన కళగా భావిస్తాను. దాని వలన జనాలు ఏదో ఒక రకంగా ప్రభావితం అవుతారు. అందుకే నేను ఒక దర్శకుడిగా బాధ్యత ఉన్న సినిమా చేయాలని అనుకుంటాను. అందుకే నా సినిమాలు ఆలస్యం అవుతుంటాయి. కథ రాసేటప్పుడు ఇది సమాజానికి అవసరమా? కాదా? అని నాకు నేనే ప్రశ్నలు వేసుకుంటాను. అయితే ఆ ప్రశ్నలకి సరైన సమాధానం వస్తే తప్ప నా స్టోరీ ముందుకు కదలదు. కథ రాయడం కోసమే ఎక్కువ సమయం తీసుకుంటాను అని శేఖర్ కమ్ముల అన్నార. ఇక కాంబినేషన్లు సెట్ చేసి సినిమాలు తీయడం సరైంది కాదని నేను చెప్పను. స్టార్స్‌తో సినిమాలు తీయడం, వాళ్లకు తగ్గట్టుగా ప్రపంచాన్ని సృష్టించి వినోదం పంచడం అనేది కొందరు డైరెక్టర్స్‌కి బలంగా మారుతుంది.
పెట్టిన బడ్జెట్ తిరిగి రావాలి అంటే కొన్ని కాంబినేషన్స్ సెట్ చేయాల్సిందే. అయితే వారి శైలికి నా శైలి చాలా భిన్నంగా ఉంటుంది. కుబేర మూవీ కథ ధనుష్, నాగార్జున, రష్మికలని కలిపింది. ఆ మూవీ చేసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఆ సినిమాని చూసి ప్రేక్షకులు తప్పక మెచ్చుకుంటారు. ఇక నేటి రాజకీయం గురించి మాట్లాడుతూ ఇది పెద్ద ఆటగా మారిపోయింది. నేను చూసిన ప్రపంచాన్ని విజువల్ మీడియాతో అందరికీ చూపించాలనే ఓ బలమైన కోరిక ఉండేది. అందుకే లీడర్ సినిమా తీసాను. ఇండస్ట్రీకి వచ్చే కొత్తతరం వారు డబ్బు, పేరు కోసమని రాకూడదు. ముందుగా నిజాయతీగా, బాధ్యతగా కథలు చెబితే చాలు అని శేఖర్ కమ్ముల అన్నారు.