Ram Charan | టాలీవుడ్ మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన కొణిదెల దంపతులు కవలలకు తల్లిదండ్రులయ్యారు. శనివారం రాత్రి హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఒక మగ శిశువుకు, ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తతో కొణిదెల కుటుంబం, కామినేని కుటుంబం ఆనందంలో మునిగిపోయాయి. మెగా అభిమానులు “డబుల్ జాయ్” అంటూ సంబరాలు జరుపుకుంటున్నారు. కవలల జననం అనంతరం రామ్ చరణ్ సోషల్ మీడియాలో చేసిన భావోద్వేగ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.
మాకు ఒక పాప, ఒక బాబు పుట్టారని ఆనందంగా పంచుకుంటున్నాను. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండటం మా జీవితాన్ని అపారమైన కృతజ్ఞతతో నింపింది. మా జీవితంలో ఉన్న మహిళలే మా గొప్ప బలం. ప్రతి క్షణంలో మాకు అండగా నిలిచిన అభిమానులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ ఆయన రాసిన మాటలు అభిమానుల హృదయాలను తాకాయి. ముఖ్యంగా తన జీవితంలో మహిళల పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
ఈ గుడ్ న్యూస్ తెలిసిన వెంటనే మెగా అభిమానులు పెద్ద ఎత్తున అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకుని బాణాసంచా కాల్చుతూ పండగ వాతావరణాన్ని సృష్టించారు. సోషల్ మీడియా వేదికగా కూడా వేల సంఖ్యలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు వరుసగా విషెస్ తెలియజేస్తున్నారు. రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు కవలలు పుట్టడంపై మెగాస్టార్ చిరంజీవి కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మీడియాతో మాట్లాడుతూ,ఎప్పటి నుంచో మా ఇంట్లో ఇలాంటి శుభం జరగాలని కోరుకున్నాం. భగవంతుడి దయతో, హనుమాన్ కృప వల్ల ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డ జన్మించారు. ఇది మాకు ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది” అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు. ఉపాసన ప్రసవాన్ని విజయవంతంగా నిర్వహించిన అపోలో ఆసుపత్రి వైద్య బృందానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అపోలో ఆసుపత్రి వైద్యులు మీడియాతో మాట్లాడుతూ ఉపాసన, ఇద్దరు చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని స్పష్టం చేశారు. మొదట బాబు, ఆ తర్వాత పాప జన్మించినట్లు వెల్లడించారు.