రామ్‌చరణ్ ‘గేమ్ చేంజర్’ సినిమా షూటింగ్ మొదలై అప్పుడే రెండేళ్లు దాటింది. సజావుగా సాగాల్సిన ఈ సినిమా షూటింగ్‌కు ‘ఇండియన్ ఫ్రాంచైజీ’ రూపంలో అనుకోని అంతరాయాలు ఎదురయ్యాయి. ఈ ఒడిదుడుకుల ప్రయాణాన్ని ఎట్టకేలకు ముగించనున్నాడు ‘గేమ్ చేంజర్’. మరో పదిరోజుల్లో రామ్‌చరణ్.. తన వెర్షన్‌కు సంబంధించిన షూటింగ్ అంతా పూర్తి చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇందులో రామ్‌చరణ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ రెండు పాత్రల్లోనూ రామ్‌చరణ్ యువకుడిగానే కనిపించనుండటం విశేషం. తండ్రి పాత్ర 70ల్లో సాగితే, కొడుకు పాత్ర సమకాలీనంగా సాగుతుందని తెలుస్తున్నది. తండ్రికి జోడీగా అంజలి, కొడుకుకి జోడీగా కైరా అడ్వానీ నటిస్తున్న విషయం తెలిసిందే. సమకాలీన రాజకీయాలకు అద్దం పడుతూ, సమాజంలోని సమస్యలను ఎత్తిచూపుతూ శంకర్ మార్క్ చిత్రంగా ఈ సినిమా ఉండబోతున్నదని తెలుస్తున్నది. ఈ ఏడాది చివర్లో ఈసినిమాను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.