SSMB29 | మహేశ్‌బాబు, రాజమౌళి సినిమా ఎప్పుడు మొదలవుతుంది? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. స్క్రిప్ట్ వర్క్ పూర్తికావచ్చిందని, లొకేషన్ల అన్వేషణ జరుగుతున్నదని, గెటప్స్‌కు సంబంధించిన స్కెచ్‌లు గీస్తున్నారని.. ఇలా రకరకాల వార్తలు మీడియాలో ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే.. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన మేజర్ వర్క్ ఇప్పటికే మొదలైందట.
వివరాల్లోకెళ్తే.. విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్ద పీట వేసే దర్శకుల్లో రాజమౌళి ఒకరని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మహేష్‌తో ఆయన చేస్తున్న సినిమాలో కూడా వీఎఫ్ఎక్స్దే మేజర్ పార్ట్. మామూలుగా గ్రీన్ మ్యాట్, బ్లూమాట్లపై షూటింగ్ పూర్తయ్యాక, వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతుంది. కానీ ఈ సినిమాకోసం ఈ ప్రాసెస్‌ని రివర్స్ చేశారట రాజమౌళి.
ముందు విజువల్ ఎఫెక్ట్స్‌కి సంబంధించిన పనులు పూర్తి చేసి, తర్వాత షూటింగ్ మొదలుపెడతారట. వీఎఫ్ఎక్స్ పూర్తయ్యాక, షూటింగ్ చేసి, రెండింటిని మెర్జ్ చేయడం హాలీవుడ్ తరహా ప్రక్రియ. ఇప్పటికే 40శాతం వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తయిందని ఇన్సైడ్ టాక్. దీన్ని బట్టి ఈ సినిమా రాజమౌళి గత చిత్రాల్లా కాకుండా, త్వరగానే పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తున్నది. డిస్నీ లాంటి హాలీవుడ్ సంస్థలు ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నట్టు సమాచారం.