Raveena Tandon | 90వ దశకంలో బాలీవుడ్‌ను రూల్ చేసిన అగ్రతారల్లో నటి రవీనా టాండన్ ఒకరు. 1991లో ‘పత్తర్ కే ఫూల్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత తన కెరీర్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న ఈ స్టార్ నటి తన కెరీర్ ప్రారంభంలో జరిగిన ఒక సంఘటన గురించి తాజాగా పంచుకుంది. తన సహనటుడితో అనుకోకుండా జరిగిన లిప్-టచ్ వల్ల తాను వాంతులు చేసుకున్నానని సంచలన వ్యాఖ్యలు చేసింది.
కెరీర్ ప్రారంభం నుంచీ ముద్దు సన్నివేశాలకు, రొమాంటిక్ సీన్స్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది రవీనా. అయితే, ఒక సినిమా షూటింగ్లో అనుకోని సంఘటన జరిగిందంటూ రవీనా వివరించారు.
“నాకు బాగా గుర్తుంది. ఒక సినిమాలో హీరో నన్ను రఫ్‌గా హ్యాండిల్ చేయాల్సిన సీన్ అది. ఆ సన్నివేశం షూట్ చేస్తుండగా, అనుకోకుండా అతడి పెదవులు నా పెదాలను తాకాయి. అక్కడ ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అది కేవలం పొరపాటున జరిగింది” అని ఆమె తెలిపారు. ఈ సంఘటన తనను తీవ్ర అసౌకర్యానికి గురి చేసిందని, “నాకు వికారంగా అనిపించింది. లైట్ తీసుకోలేకపోయాను. వెంటనే వాష్‌రూమ్‌లోకి వెళ్లి వాంతులు చేసుకున్నాను. ఆ తర్వాత బ్రష్ చేసుకొని దాదాపు వంద సార్లు ముఖం కడుక్కున్నాను” అంటూ షాకింగ్ విషయాలు వెల్లడించారు.
ఆ నటుడికి ఎలాంటి చెడు ఉద్దేశం లేదని.. ఆ సంఘటన తర్వాత ఆ హీరో వచ్చి తనకు క్షమాపణ కూడా చెప్పాడని, అయినా తనకు అది తట్టుకోలేకపోవడం వల్ల అలా జరిగిందని రవీనా చెప్పుకొచ్చారు.
రవీనాకు ముద్దు సన్నివేశాలంటే అసౌకర్యంగా ఉన్నప్పటికీ, తన కూతురు రాషా థడానీ విషయంలో మాత్రం ఎలాంటి నిబంధనలు పెట్టనని తెలిపారు. “పాత్ర డిమాండ్ చేసి, తన కూతురు సౌకర్యంగా భావిస్తే, అలాంటి సన్నివేశాలు చేయడంలో నాకు అభ్యంతరం లేదు. ఎవరూ కూడా ఇష్టం లేని పనిని బలవంతం చేయకూడదు” అని రవీనా పేర్కొన్నారు. రవీనా టాండన్ ఇటీవల ‘కేజీఎఫ్ 2’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించారు.