కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ జీవిత కథతో ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఏడాది క్రితం బాలీవుడ్లో ప్రయత్నాలు జరిగాయి. ప్రముఖ జర్నలిస్ట్ రషీద్ కిద్వాయ్ ‘సోనియా’ పేరుతో రాసిన సోనియాగాంధీ ఆటోబయోగ్రఫీ ఆధారంగా నిర్మాత డా॥ మురళీమనోహర్ ఈ సినిమా తీయాలని గట్టి ప్రయత్నాలే చేశారు. అయితే సోనియాగాంధీతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఈ సినిమాకు సంబంధించిన హక్కులను ఇవ్వడానికి నిరాకరించారు. దాంతో ఈ ప్రాజెక్ట్‌ను రద్దు చేశారు. సోనియాగాంధీ బయోపిక్‌లో నటించడానికి పలువురు హాలీవుడ్ తారలతో పాటు బాలీవుడ్ సీనియర్ కథానాయిక ప్రీతి జింటా పేరును కూడా పరిశీలించారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి ప్రీతి జింటా స్పందించింది. సోనియాగాంధీ బయోపిక్ కార్యరూపం దాల్చకపోవడం తనను నిరూత్సాహానికి గురిచేసిందని పేర్కొంది. ‘సోనియా పాత్రను పోషించే అవకాశం నాకే వస్తుందనుకున్నా. ఆమెను నేను ఆరాధిస్తాను. సోనియాగాంధీ జీవితంలో మలుపులు, ఉద్వేగాలు ప్రతి హృదయాన్ని కదిలిస్తాయి’ అని ప్రీతి జింటా తెలిపింది. రషీద్ కిద్వాయ్ రాసిన బయోపిక్‌లో సోనియాగాంధీ వ్యక్తిగత జీవితంతో పాటు రాజకీయ ప్రస్థానాన్ని వివరించారు.