ఆర్థిక విషయాల్లో ఆడవాళ్లు ఆచితూచి వ్యవహరిస్తారనేది తెలిసిందే! అయితే, సామాన్య గృహిణులేకాదు.. స్టార్ హీరోయిన్లయినా డబ్బు విషయంలో చాలా స్పష్టంగా ఉంటారట. బాలీవుడ్ హీరోలకు చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న బిమల్ పరేఖ్ ఇదే విషయం చెబుతున్నాడు. స్టార్ హీరోలు ఆమిర్‌ఖాన్, రణ్‌బీర్ కపూర్‌తో పోలిస్తే.. ఆర్థిక లావాదేవీల నిర్వహణలో కత్రినా కైఫ్ చాలా తెలివిగా వ్యవహరిస్తుందని అంటున్నాడు. తాజాగా ఓ హాలీవుడ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలీవుడ్ హీరోలు ఆర్థిక లావాదేవీల్లో ఎలా వ్యవహరిస్తారో చెప్పుకొచ్చాడు. ‘డబ్బు విషయాల్లో ఆమిర్ ఖాన్, రణ్‌బీర్ కపూర్ చాలా నిదానంగా ఉంటారు. ఆర్థిక సంబంధమైన చాలా అంశాలు వారికి అర్థంకావు కూడా.
ఈ విషయంలో కత్రినా కైఫ్ చాలా బెటర్. ఆమె ఎంతో చురుకైంది. ఆర్థికపరమైన విషయాలపై ఆమె ఎక్కువ ఆసక్తి చూపుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రణ్‌బీర్‌కు చెందిన సాకర్ జట్టుతోపాటు ఆర్థిక విషయాల్లోనూ ఆయన జోక్యం తక్కువగా ఉండేదట. తుది నిర్ణయాలన్నీ ఆయన తండ్రి, దివంగత రిషి కపూర్ మాత్రమే తీసుకునేవారట. ‘ఇప్పుడు రిషి సర్ లేరు. జట్టును ఎవరు నడిపిస్తారో చూడాలి. కపూర్ కుటుంబం నుంచే ఎవరైనా వ్యాపారాన్ని చూసుకుంటారని రణ్‌బీర్ భావిస్తున్నారు’ అంటూ వెల్లడించాడు. ఇక ఆమిర్ విషయానికి వస్తే.. సినిమా కోసం ముందుగానే డబ్బు తీసుకోవడం గానీ, లాభాల్లో వాటాగానీ ఆమిర్ పట్టించుకోడట. ‘నిర్మాతలు డబ్బు పోగొట్టుకోకూడదన్నది ఆమిర్ ఫిలాసఫీ. అందుకోసం చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఒకవేళ సినిమా బాగా ఆడి.. లాభాలు వస్తే వాటా తీసుకుంటానని చెబుతాడు.
కానీ, సినిమా హిట్ అయినా.. ఆమిర్ తీసుకునేది చాలా తక్కువ మొత్తమే!’ అంటూ చెప్పుకొచ్చాడు. ‘కత్రినా కైఫ్ మాత్రం వీరిద్దరిలా ఉండదు. డబ్బుకు సంబంధించిన అన్ని విషయాలనూ తన అదుపులోనే ఉంచుకుంటుంది. ఏ సినిమాకు ఎంత తీసుకోవాలి? వాటిని ఎలా పెట్టుబడులకు మళ్లించాలి? అనే విషయాలపై పూర్తి అవగాహనతో ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక బిమల్ పరేఖ్ విషయానికి వస్తే.. ఆమిర్ ఖాన్‌కు చాలాకాలంగా చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా రణ్బీర్కూ ఆర్థిక సలహాదారుడిగా వ్యవహరిస్తున్నాడు.