’ఖూఫియా
నెట్ఫ్లిక్స్: అక్టోబర్ 5
తారాగణం: టబు, ఆశిష్ విద్యార్థి, అలీ ఫాజిల్, వామికా గబ్బి, అజ్మేరీ తదితరులు.
దర్శకత్వం: విశాల్ భరద్వాజ్.
స్పై థ్రిల్లర్ చిత్రాలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. పైగా విశాల్ భరద్వాజ్ లాంటి విభిన్న దర్శకుడు తెరకెక్కిస్తే మరింత కిక్ ఉంటుందని ప్రేక్షకుల నమ్మకం. ఆయన తాజాగా దర్శకత్వం వహించిన ‘ఖూఫియా’ స్ట్రీమింగ్లో రికార్డులు సాధిస్తున్నది. టబు, ఆశిష్ విద్యార్థి తదితర వెటరన్ నటీనటులతో విశాల్ చేసిన ప్రయోగం సక్సెస్ సాధించిందనే చెప్పొచ్చు. కథలోకి వెళ్తే కృష్ణ మెహ్రా అలియాస్ కేఎమ్ (టబు) రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) అధికారి. జీవ్ (ఆశిష్ విద్యార్థి) ఆమెకు బాస్. హీనా రెహమాన్ (అజ్మేరీ) సాయంతో నిర్వహిస్తున్న ‘ఆపరేషన్ ఆక్టోపస్’ చివరి నిమిషంలో బెడిసికొడుతుంది.
హీనా దారుణ హత్యకు గురవుతుంది. ఈ ఆపరేషన్ విఫలం కావడానికి ‘రా’ అధికారి రవి మోహన్ (అలీ ఫాజిల్) కారణమని జీవ్ అనుమానిస్తాడు. అతని కుటుంబంపై నిఘా పెంచుతాడు. ఈ క్రమంలో రవి దేశ రహస్య సమాచారాన్ని విదేశాలకు అమ్ముతున్నట్టుగా గుర్తిస్తారు. ‘ఆపరేషన్ బ్రూటస్’ పేరుతో రవి వెనుక ఉన్నవాళ్లు ఎవరో కనిపెట్టే ప్రయత్నం చేస్తుంది కేఎమ్. ఈ ఆపరేషన్లో రవి భార్య చారు (వామికా గబ్బీ) ‘రా’ అధికారులకు సాయం చేస్తుంది. ఇంతకీ రవిని ‘రా’ పట్టుకుందా? అతని వెనుక ఉన్నదెవరు? హీనాకు, రా అధికారి కేఎమ్కు ఉన్న సంబంధం ఏంటి? ఇవన్నీ మిగిలిన కథ. మధ్యమధ్యలో సాగదీతగా అనిపించినా.. పతాక
సన్నివేశాలు ఆసక్తికరంగా మలచడంతో సినిమా బోర్ కొట్టదు.