Prabhas Wedding rumours | హైదరాబాద్కు చెందిన ఓ అమ్మాయితో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వివాహం జరగబోతోందని వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. నగరంలోని ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ వివాహం ఖరారైందని, త్వరలోనే ఆ వేడుక జరగనుందని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. బాలకృష్ణ నిర్వహించిన ‘అన్ స్టాపబుల్’ షోలో రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలను కూడా నెటిజన్లు ఈ విషయంతో ముడిపెడుతున్నారు. గణపవరం గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ప్రభాస్ వివాహం చేసుకోబోతున్నాడని రామ్ చరణ్ ఆ షోలో చెప్పిన మాటలు సత్యమవుతున్నాయని, ఆ అమ్మాయి కుటుంబం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడిందని, ఇరు కుటుంబాలు ఈ వివాహానికి సమ్మతించాయని పోస్టులు వైరల్గా మారాయి.
అయితే ఈ వార్తలపై ప్రభాస్ టీమ్ తాజాగా స్పందించింది. ప్రభాస్ వివాహం గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన బృందం స్పష్టత ఇచ్చింది. ఇటువంటి పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. ఏదైనా అధికారిక సమాచారం ఉంటే తామే స్వయంగా ప్రకటిస్తామని పేర్కొంది. ప్రస్తుతం 54 ఏండ్ల వయసు ఉన్న ప్రభాస్ పెళ్లి కోసం ఆయన అభిమానులతో పాటు కుటుంబం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ప్రభాస్ వివాహం జరుగుతుందని ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి కూడా ఇటీవల వెల్లడించారు. ప్రస్తుతం ప్రభాస్ ‘ది రాజాసాబ్’, ‘ఫౌజీ’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది చివరిలో ‘స్పిరిట్’ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావచ్చని సమాచారం.