‘నాన్న చిరంజీవి సినీ ప్రయాణం, ఆయన అందుకున్న విజయాలు, సాధించిన ఘనతల్ని పొందుపరుస్తూ వెబ్సైట్ రూపొందించడం గర్వంగా ఉంది’ అని అన్నారు అగ్ర హీరో రామ్చరణ్. చిరంజీవి సినీ, వ్యక్తిగత జీవితవిశేషాలతో కూడిన www.kchiranjeevi.com అనే వెబ్సైట్ను సోమవారం రామ్చరణ్ ప్రారంభించారు. దీనితో పాటుగా చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను విస్త్రతం చేస్తూ www.chiranjeevicharitabletrust.com అనే వెబ్సైట్ను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రామ్చరణ్ మాట్లాడుతూ ‘ 1988 అక్టోబర్ 2న చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ప్రారంభమైంది. ఈ ట్రస్ట్ ద్వారా రెండు దశాబ్దాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అనేక అవార్డులను అందుకోవడం గర్వంగా అనిపిస్తున్నది. కరోనా మహమ్మారి తర్వాత సహాయాన్ని అర్థించే లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. కాలయాపన లేకుండా అందరికీ త్వరగా సాయం అందించాలనే ఆలోచనతోనే వెబ్సైట్ను మొదలుపెట్టాం. మా దగ్గరకు రావాల్సిన అవసరం లేకుండానే ఆన్లైన్ ద్వారా ఆక్సిజన్, రక్తదానం లాంటి సేవలను పొందవచ్చు. భవిష్యత్తులో అవయవదాన సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం. భాషాభేదాలతో సంబంధం లేకుండా అందరికీ అండగా నిలవాలన్నదే మా లక్ష్యం. 25 భాషల్లో ఈ వెబ్సైట్ అందుబాటులో ఉంటుంది. అలాగే నాన్న చిరంజీవి సినీ ప్రయాణంతో పాటు ఆయన సాధించిన ఘనతల్ని వెబ్సైట్లో పొందుపరిచాం. ఆయన నటించిన 151 సినిమాల విశేషాలు, అవి అందుబాటులో ఉన్న మాధ్యమాలు, దర్శకనిర్మాతలతో నాన్నకు ఉన్న అనుబంధం, రాజకీయ నాయకుడిగా ఆయన సాగించిన పోరాటం తాలూకు సమగ్ర సమాచారం కేచిరంజీవి డాట్కామ్ వెబ్సైట్లో ఉంటుంది’ అని చెప్పారు.