Allu Aravind | ఒకవైపు పుష్ప 2 వివాదం ముగిసింది అనుకునేలోపే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అల్లు ఫ్యామిలీకి మరో షాక్ తగిలింది. ఇటీవల అమ్మ మరణించి బాధలో ఉన్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఉన్న ఆయనకు చెందిన అల్లు బిజినెస్ పార్క్‌పై ఈ చర్యలు తీసుకున్నారు.
ఈ భవన నిర్మాణానికి నాలుగు అంతస్తుల వరకు మాత్రమే జీహెచ్ఎంసీ అనుమతులు ఇచ్చింది.. అయితే, తాజాగా భవనంపై అదనంగా ఒక పెంట్‌హౌస్‌ను నిర్మించారని అధికారులు ఇటీవలే గుర్తించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అనుమతులు లేని ఆ నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేయకూడదో వివరించాలని కోరుతూ GHMC సర్కిల్-18 అధికారులు అల్లు అరవింద్‌కు షోకాజ్ నోటీసు పంపారు. అల్లు ఫ్యామిలీ వ్యాపార కార్యకలాపాలకు కేంద్రంగా ఉండనున్న ఈ అల్లు బిజినెస్ పార్క్ నిర్మాణ పనులు 2023 నవంబర్‌లో ప్రారంభమయ్యాయి. దివంగత నటుడు అల్లు రామలింగయ్య 101వ జయంతి సందర్భంగా ఈ ప్రాజెక్టును మొదలుపెట్టారు. గీతా ఆర్ట్స్, అల్లు ఆర్ట్స్ వంటి సంస్థల కార్యాలయాలు ఈ భవనంలో ఉండనున్నాయి. అయితే, అక్రమ నిర్మాణాల కారణంగా ఈ భవనం ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. అయితే ఈ నోటీసులపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే అల్లు ఫ్యామిలీని టార్గెట్ చేస్తుందని కామెంట్లు పెడుతున్నారు.