CM Vijay | తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు సూపర్‌స్టార్ రజినీకాంత్ బహిరంగంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదంటూ సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై రజినీకాంత్ స్పందించారు. బుధవారం చెన్నైలో జరిగిన తన కొత్త చిత్రం ‘ధర్మన్’ లాంచ్ కార్యక్రమంలో ఆయన ఈ వివాదానికి తెరదించారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మీడియా అడిగిన ప్రశ్నకు రజినీకాంత్ బదులిస్తూ, తామిద్దరం ఇప్పటికే వ్యక్తిగతంగా (ప్రైవేట్‌గా) మాట్లాడుకున్నామని దీనిపై చర్చలు అవసరం లేదని తెలిపాడు. జూన్ 22న ముఖ్యమంత్రి విజయ్ 52వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, కమల్ హాసన్, కీర్తి సురేష్, ఖుష్బూ సుందర్, మోహన్‌లాల్, త్రిష సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు బహిరంగంగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే విజయ్‌కి రజినీకాంత్ విష్ చేయకపోవడంపై కొందరు ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. గతంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా రజినీకాంత్ బహిరంగంగా స్పందించకపోవడంతో ట్రోల్‌కి గురికాగా.. మరోసారి ఆయనను టార్గెట్ చేశారు నెటిజన్లు. అయితే తాజాగా ఈ వివాదానికి ముగింపు పలికాడు రజనీకాంత్.
ఇక సినిమాల విషయానికి వస్తే, రజినీకాంత్ నటిస్తున్న ‘ధర్మన్’ చిత్రాన్ని అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతోంది. ఈ సినిమాను ‘పడయప్ప’ (నరసింహా), ‘వేట్టయాడు విళయాడు’ (రాఘవన్) చిత్రాల కలయికగా దర్శకుడు అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు కోసం గతంలో సుందర్ సి, సిబి చక్రవర్తి వంటి పేర్లు పరిశీలనకు రాగా, చివరకు అశ్వత్ మారిముత్తు దర్శకుడిగా ఎంపికయ్యారని రజినీకాంత్ తెలిపారు. ఈ చిత్రంలో రజినీకాంత్ ఒక పవర్ఫుల్ డాక్టర్ పాత్రలో కనిపించనున్నారు. సిమ్రాన్, రాశి ఖన్నా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ, ప్రదీప్ ఇ రాఘవ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్లు అన్బరివ్ కూడా ఈ భారీ ప్రాజెక్టులో భాగమయ్యారు.