Rana Naidu 2 | నెట్‌ఫ్లిక్స్ వేదికగా రాబోతున్న పాపులర్ వెబ్ సిరీస్ రానా నాయుడు సీజన్ 2పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నటుడు రానా దగ్గుబాటి. రానా, విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ సీజన్ 1కి కొనసాగింపుగా రాబోతుంది. కరణ్ అన్షుమణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో అర్జున్ రాంపాల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. జూన్ 13న ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. బుధవారం టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా ఈ వేడుకలో రానా మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రానా మాట్లాడుతూ.. ‘రానా నాయుడు’ మొదటి సీజన్‌ను ప్రపంచవ్యాప్తంగా చాలా మంది చూశారని, కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం పెద్దగా చూడలేదని రానా అభిప్రాయపడ్డారు. దీనికి ప్రధాన కారణం అందులో ఉన్న బూతులు, అధిక హింస అని ఆయన పరోక్షంగా అంగీకరించారు. ఈ నేపథ్యంలో, ‘రానా నాయుడు’ సీజన్ 2లో మార్పులు చేసినట్లు బూతులు తగ్గించి, హింస (violence) ఎక్కువ పెట్టాం అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మొదటి సీజన్లో అధిక శృంగారం, బూతు మాటలు ఎక్కువ ఉన్నాయని తెలుగు ప్రేక్షకుల నుండి విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. వీటిని దృష్టిలో ఉంచుకొని, రెండవ సీజన్లో మార్పులు చేయడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ కావాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు రానా మాటలు సూచిస్తున్నాయి. అయితే, బూతులు తగ్గించి హింసను పెంచడం ఎంతవరకు ఆదరణ పొందుతుందో చూడాలి.