Vishal Dadlani | బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో 2016 నాటి ‘నోట్ల రద్దు’ (Demonetisation)ను చూపించిన విధానంపై ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన నోట్ల రద్దు నిర్ణయాన్ని ‘ఆపరేషన్ గ్రీన్ లీఫ్’ అనే పేరుతో ఒక రహస్య ఆపరేషన్‌గా చిత్రీకరించారు. పాకిస్థాన్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు నిధులను అడ్డుకోవడమే దీని ప్రధాన ఉద్దేశమని సినిమాలో చూపించారు. దీనిపై విమర్శలు వస్తుండగా.. తాజాగా ఇదే విషయంపై ప్రముఖ బాలీవుడ్ సింగర్, సంగీత దర్శకుడు విశాల్ దద్లానీ ఎక్స్ వేదికగా స్పందించాడు.
ధురంధర్ 2 సినిమా వలన కొత్తగా ప్రచారంలోకి వస్తున్న చెత్తను చూస్తుంటే ఒక విషయం గుర్తుంచుకోవాలి.. సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే. రాజకీయ ప్రచారం కాదు. అలాగే వాస్తవాలు ఎప్పటికీ వాస్తవాలే. నోట్ల రద్దు వలన ఇండియాలో నల్లధనం పూర్తిగా అంతం కాలేదు. అలాగే నోట్ల రద్దు తర్వాత కూడా పుల్వామా, పహల్గామ్ వంటి భారీ ఉగ్రదాడులు జరిగాయని గుర్తుంచుకోవాలి. సినిమాలను సరదా కోసం చూడండి, కానీ సమాచారం, చరిత్ర కోసం మంచి బుక్స్, వెబ్సైట్లను వెతుక్కోండి అంటూ ప్రజలకు ఆయన హితవు పలికాడు.