ముంబై: ‘తారక్ మెహతా కా ఉల్టా ఛస్మా’ షోలో నటించేటప్పుడు తాను సెట్స్‌లో తీవ్రంగా టార్చర్ అనుభవించానని నటి మోనికా భదోరియా గుర్తుచేసుకుంది. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘నువ్వు గర్భవతిలా లావుగా ఉన్నావు. 20 రోజుల్లో బరువు తగ్గాలి.’ అంటూ షో మేకర్స్ ఆర్డర్ వేశారని ఆరోపించింది.
షో షూటింగ్ జరుగుతుండగా ఓ సందర్భంలో షో ప్రాజెక్ట్ హెడ్ సోహిల్ రమణి తనకు ఫోన్ చేసి అతని కార్యాలయానికి పిలిపించాడని, కానీ తాను ఆయన కార్యాలయానికి వెళ్లేసరికి అక్కడ అకౌంట్స్ డిపార్టుమెంటులో ఒక వ్యక్తి తప్ప ఎవరూ లేరని మోనికా చెప్పింది. ఆ వ్యక్తిని ఆరా తీస్తే ‘సార్ మీ బరువు గురించి మాట్లాడటానికి మిమ్మల్ని పిలిపించారు’ అని చెప్పాడని ఆమె తెలిపింది.
కొంతసేపటి తర్వాత సోహిల్ రమణి వచ్చి ‘మీరు చాలా లావుగా ఉన్నారు. చూడటానికి ఒక గర్భవతిలా కనిపిస్తున్నారు. మీరు ఏం చేస్తారో తెలియదు. 20 రోజుల్లో బరువు తగ్గి కనిపించాలి. అలాగైతేనే షోలో నటిస్తారు. లేకపోతే లేదు’ అని చెప్పినట్లు మోనికా గుర్తుచేసుకుంది. దాంతో ‘బరువు తగ్గడానికి అయ్యే ఖర్చులను మీరు భరిస్తారా..?’ అని అడిగానని, అందుకు ఆయన ‘మీ బరువు తగ్గించడం మా బాధ్యత కాదు’ అని చెప్పారని తెలిపింది.
వాస్తవానికి ఆ షో కోసం తాను బరువు తగ్గడం అవసరమే లేదని, కేవలం తనను వేధించడానికే తన బరువును సాకుగా వాడుకున్నారని మోనికా ఆరోపించింది. వారి టార్చర్ భరించలేక తాను బరువు తగ్గడం కోసం చాలా తక్కువగా తినేదాన్నని, అందువల్ల చాలాసార్లు సెట్స్‌లో కళ్లు తిరిగిపడిపోయానని ఆమె చెప్పింది. ‘తారక్ మెహతా కా ఉల్టా ఛస్మా’ షో ప్రాంతం ఒక విషపూరిత ప్రదేశమని వ్యాఖ్యానించింది. కాగా, ప్రస్తుతం థెరపీ కోసం మోనికా భదోరియా ఆ షో నుంచి తప్పుకుంది.