War 2 Movie | ఒకప్పుడు తెలుగు సినిమా అంటే వినోదం అనేవారు. కానీ ఇప్పుడు తెలుగు సినిమా అంటే దోచుకోవడం అని అంటారు. దీనికి కారణం తాజాగా రాబోతున్న జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 చిత్రం. ఈ సినిమా హిందీలో సాధారణ ధరలతో విడుదల కాబోతుండగా, డబ్బింగ్ వెర్షన్ తెలుగులో మాత్రం టికెట్ ధరలను నిర్మాతలు పెంచబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రతి స్టార్ సినిమాకు పెరుగుతున్న టికెట్ ధరలతో పాటు, డబ్బింగ్ సినిమాలకు కూడా టికెట్ రేట్లు పెంచడం ప్రస్తుతం నెటిజన్ల ఆగ్రహానికి కారణమవుతోంది.
ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 సినిమాతో పాటు రజనీకాంత్ నటిస్తున్న కూలీ చిత్రాలు సొంత భాషల్లో సాధారణ టికెట్ ధరల్లోనే ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతుండగా.., తెలుగులో ఈ సినిమాలకు టికెట్ ధరలను పెంచబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవే కాకుండా ఇంతకుముందు వచ్చిన చాలా తెలుగు సినిమాలకు కూడా టికెట్ ధరలను పెంచి జనాన్ని థియేటర్లకు రాకుండా చేస్తున్నారు నిర్మాతలు. దీంతో సోషల్ మీడియాలో ఈ అంశంపై తీవ్రమైన ట్రోలింగ్ జరుగుతోంది. “ఒకే సినిమా, ఒకే కంటెంట్, కానీ వేర్వేరు భాషలకు వేర్వేరు ధరలు ఎందుకు?” అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. “ఇది తెలుగు ప్రేక్షకులను దోచుకోవడమే” అని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో తెలుగు సినీ పరిశ్రమ స్పందించాల్సిన అవసరం ఉందని, లేకపోతే ప్రేక్షకులు సినిమా చూడటం మానేసి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై ఆధారపడటం పెరుగుతుందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఇది భవిష్యత్తులో తెలుగు సినిమా పరిశ్రమకు చాలా నష్టం కలిగించే అవకాశం ఉందని తెలుపుతున్నారు.
గతంలో ఒక సినిమా టికెట్ ధర గరిష్టంగా రూ.150 నుండి రూ.200 వరకు ఉండేది. కానీ ఇప్పుడు కొత్తగా విడుదలయ్యే ప్రతి స్టార్ సినిమాకు టికెట్ ధరలు రూ.300 నుండి రూ.400 వరకు చేరుకున్నాయి. కొన్ని మల్టీప్లెక్స్‌లలో అయితే మొదటి వారం టికెట్ ధరలు రూ.500 వరకు కూడా పెంచుతున్నారు. ఈ ధరలు సామాన్య ప్రేక్షకుడికి చాలా భారంగా మారాయి. దీంతో కుటుంబంతో కలిసి సినిమా చూడాలంటే దాదాపు రూ.2 వేలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తుంది.