హృతిక్, తారక్ హీరోలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ‘వార్ 2’ చిత్రం షూటింగ్ ముంబై పరిసరాల్లో శరవేగంగా జరుగుతున్నది. ఇంకొన్ని రోజుల్లో ఎన్టీఆర్ పార్ట్ కంప్లీట్ కానున్నదని బీటౌన్ సమాచారం. ఈ నెలాఖరు నుంచి ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు తారక్. ఇందులో మలయాళ హీరోలు బీజూ మీనన్, టోవినో థామస్ కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. కథానాయికగా రుక్మిణి వసంత్ ఖరారైంది. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా ఖరారయ్యారట. వారి వివరాలను ప్లాన్ ప్రకారం ఒక్కొక్కటిగా రివీల్ చేయాలని ప్రశాంత్‌నీల్ భావిస్తున్నారట.
ఇదిలావుంటే.. ఈ సినిమా కథకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఇది డ్రగ్స్ మాఫియా చుట్టూ తిరిగే కథ అని ఇన్సైడ్ టాక్. థాయిలాండ్, మయన్మార్, లాయిస్లను కలిపి భౌగోళికంగా గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. ఇక్కడి నుంచే కొకైన్, గంజాయి స్మగ్లింగ్ అవుతూవుంటాయి. మాదకద్రవ్యాల సామ్రాజ్యానికి అదో స్వర్గధామం. అక్కడ జరిగే అరాచకాలు, అక్రమాల నేపథ్యంలో ఈ కథ నడుస్తుందట. ‘డ్రాగన్’ అనే పేరు దాదాపు ఖరారైందని సమాచారం. ఆగస్ట్‌లోగా షూటింగ్ కంప్లీట్ చేసి, నాలుగు నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్‌కి కేటాయించనున్నారట ప్రశాంత్‌నీల్. వచ్చే ఏడాది జనవరిలో సినిమా విడుదల కానుంది.