War 2 | తెలుగు హీరోలు ఒక్కొక్కరుగా బాలీవుడ్లో అడుగుపెడుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ హిందీలో నేరుగా సినిమా చేస్తుండగా…ఇటీవలే అల్లు అర్జున్ కూడా తన బాలీవుడ్ మూవీని అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో స్టార్ హీరో ఎన్టీఆర్ బాలీవుడ్లో అరంగేట్రం చేయబోతున్నారు. ‘వార్ 2’ చిత్రంలో ఆయన హృతిక్ రోషన్‌తో కలిసి నటించబోతున్నట్లు సమాచారం. హృతిక్‌తో ఢీ అంటే ఢీ అనే విధంగా ఎన్టీఆర్ క్యారెక్టర్ ఉంటుందట.
2019లో విడుదలైన ‘వార్’ విజయాన్ని సాధించింది. యష్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్‌లో భాగంగా నిర్మించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. హృతిక్‌తో పాటు హీరోగా ఎన్టీఆర్ నటించబోతున్నారని బాలీవుడ్ మీడియా పేర్కొంది. ఈ చిత్రానికి ‘బ్రహ్మాస్త్ర’ ఫేం అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారు. ఈ ఏడాది చివరలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్తారని సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ తన 30వ చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటున్నది.