‘మోహన్‌లాల్‌తో ప్రియదర్శిన్ తీసిన ‘చిత్రం’ సినిమాని తెలుగులో ‘అల్లుడుగారు’గా రీమేక్ చేసి, జీరో నుంచి స్టార్ హీరోగా మారాను. అప్పట్నుంచి నాకూ, మోహన్లాల్కూ బంధం ఏర్పడింది. మోహన్‌లాల్ అప్పుడెలా ఉన్నారో, మానసికంగా శారీరకంగా ఇప్పుడూ అలాగే ఉన్నారు. స్వచ్ఛమైన మనసు ఉన్నవారే అలా ఉండగలరు. క్రమశిక్షణ గల నటుడాయన. ఒక్క రూపాయి తీసుకోకుండా మా ‘కన్నప్ప’లో నటించారు మోహన్‌లాల్. ఆయన చూపించిన ప్రేమను ఎప్పటికీ మరువలేను. మోహన్‌లాల్ అంతటి మహానటుడితో నటించే అవకాశం మా విష్ణుకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. మోహన్‌లాల్‌తో నాకూ నటించాలని ఉంది. అవకాశం ఇవ్వమని అడుగుతున్నా.’ అని డా.మోహన్‌బాబు అన్నారు. మంచు విష్ణు కథానాయకుడిగా ఆయన నిర్మించిన భక్తిరసాత్మక చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ సందర్భంగా కేరళలోని కొచ్చీలో నిర్వహించిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో మోహన్‌బాబు మాట్లాడారు. ‘కన్నప్ప’ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉందని, అన్ని భాషల నటీనటులు నటించిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని, గొప్ప శివభక్తుడైన కన్నప్ప కథను ఎంతో అద్భుతంగా దర్శకుడు తెరకెక్కించారని, శివానుగ్రహంతో ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మోహన్‌లాల్ ఆకాంక్షించారు. మోహన్‌లాల్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం పూర్వజన్మ సుకృతమని, ఇందులో ఆయన పాత్ర సర్ప్రైజింగ్గా ఉంటుందని మంచు విష్ణు తెలిపారు. సినిమాను అందరూ ఇష్టంతో, ప్రేమతో తీస్తారని, మేం మాత్రం ఈ సినిమాను భక్తితో ఓ ప్రార్థనలా తీశామని దర్శకుడు ముఖేష్కుమార్సింగ్ చెప్పారు. ఇంకా అర్పిత్ రంకా, ముఖేష్‌రిషి, ఆంటోని పెరంబవూర్ కూడా మాట్లాడారు.