Waltair Veerayya First Single | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెగా కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ‘ఖైదీ నం.150’తో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన చిరుకు ‘సైరా’, ‘ఆచార్య’ ఫలితాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ఇటీవలే భారీ అంచనాల నడుమ రిలీజైన ‘గాడ్‌ఫాదర్’ పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది.. కానీ బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. ఇలా వరుసగా మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో మెగాస్టార్ తీవ్రంగా నిరాశపడ్డాడు. ప్రస్తుతం చిరు ఆశలన్ని ‘వాల్తేరు వీరయ్య’ సినిమా పైనే ఉన్నాయి. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ సినిమా ఫస్ట్ సింగిల్ డేట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వాల్తేరు వీరయ్య ఫస్ట్ సింగిల్ నవంబర్ 14న రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే చిరు- దేవి శ్రీ ప్రసాద్ కాంబోలో వచ్చిన సినిమాలన్ని మ్యూజికల్‌గా హిట్టయ్యాయి. ఈ చిత్రం కూడా మ్యూజికల్‌గా మంచి విజయం సాధిస్తుందని చిత్రబృందం ధీమాగా ఉంది. ఈ చిత్రంలో చిరంజీవి యూనియన్ లీడర్‌గా కనిపించనుండగా.. రవితేజ పోలీస్ ఆధికారి పాత్రలో నటించనున్నాడు. చిరుకు జోడీగా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.