కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ నటించిన ప్రతిష్టాత్మక పానిండియా చిత్రం ‘వృషభ’. నందకిశోర్ దర్శకుడు. శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె.పద్మకుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్‌సింగ్, విశాల్ గుర్నాని, జుహి పరేఖ్ మెహతా నిర్మాతలు. ఈ నెల 25న గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ చిత్రం తెలుగులో గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ప్రచారంలో భాగంగా ఈ సినిమా ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. లెజెండరీ బిజినెస్ మ్యాన్ ఆదిదేవవర్మ(మోహన్‌లాల్)కు శత్రువులు ఎక్కవే. ఈ కారణంగా మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు.
ఈ క్రమంలో అతనికి గత జన్మ జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి. ఆ జ్ఞాపకాల్లో తన ప్రజల్ని కాపాడుకుంటున్న అసమాన యోధుడైన రాజా విజయేంద్ర వృషభగా కనిపిస్తుంటాడు. మరోవైపు బిజినెస్‌మ్యాన్ ఆదిదేవవర్మ కొడుకు సైకియాట్రిస్టులతో సంప్రదింపులు చేస్తూ, శత్రు దాడుల నుంచి తండ్రిని కాపాడుకుంటూ ఉంటాడు. అసలు ఆదిదేవవర్మ జ్ఞాపకాల్లో కనిపిస్తున్న విజయేంద్ర వృషభ ఎవరు? అతని గొప్పతనం ఏంటి? ఆ గతానికీ, ఈ వర్తమానానికీ లింకేంటి? అనే ఆసక్తిని ఈ ట్రైలర్ కలిగించింది. ఈ చిత్రానికి కెమెరా: ఆంటోనీ సామ్సన్, సంగీతం: సామ్ సీఎస్, అరియన్ మెహెదీ.