‘నేను విధిని బలంగా విశ్వసిస్తాను. మనకు రాసిపెట్టి ఉంటే తప్పకుండా జరిగి తీరుతుంది. ఇండస్ట్రీలో నా సెకండ్ ఇన్సింగ్స్ అద్భుతంగా కొనసాగుతున్నది’ అని అన్నారు సీనియర్ నటుడు వీకే నరేష్. బాల నటుడిగా సినీ రంగంలో అరంగేట్రం చేసిన ఆయన హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన విలక్షణ నటనతో మెప్పిస్తున్నారు. ఈ ఏడాదితో ఆయన సినీ రంగంలోకి ప్రవేశించి యాభై ఏండ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వీకే నరేష్ ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా సంభాషించారు. ఆ
ఏడేళ్ల వయసులోనే ‘పండంటి కాపురం’ చిత్రం ద్వారా బాల నటుడిగా పరిశ్రమకు పరిచయమయ్యాను. అనంతరం హీరోగా రాణించాను. తొలి నుంచి కథల ఎంపికలో కొత్తదనం కోసం తపించేవాడిని. పాత్రలపరంగా వైవిధ్యం చూపించాలనే తాపత్రయం ఉండేది. హీరోగా నా కెరీర్‌ను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ‘చిత్రం భళారే విచిత్రం’ ‘జంబలకిడిపంబ’ వంటి అవుట్ ఆఫ్ బాక్స్ కథాంశాలతో ఆ రోజుల్లోనే సినిమాలు చేశాను. అయితే హీరోగా గొప్ప స్థితిలో కొనసాగుతున్న తరుణంలోనే నా సిద్ధాంతాలకు అనుగుణంగా రాజకీయ రంగ ప్రవేశం చేశాను. సామాజిక కార్యక్రమాల్లో భాగమయ్యాను. అయితే సినిమాల నుంచి అకస్మాత్తుగా వైదొలగడం తప్పుడు నిర్ణయమని ఆ తర్వాత తెలుసుకున్నా.
రాజకీయ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నా నా ధ్యాసంతా సినిమా మీదే ఉండేది. సినిమా నా కలలోకి వచ్చేది. పరిశ్రమకు నేను ఇవ్వాల్సింది ఏదో ఉందనే భావన కలిగేది. ఆ తపనతోనే సెకండ్ ఇన్సింగ్స్‌ను మొదలుపెట్టాను. అయితే ఆరంభంలో ఇండస్ట్రీ వారే నాపై దుష్ప్రచారం చేశారు. అన్ని అవాంతరాలను దాటుకొని సెకండ్ ఇన్సింగ్స్‌లో వరుస విజయాలతో నా స్థానాన్ని సుస్థిరం చేసుకున్నా. యువ దర్శకులతో సాన్నిహిత్యం వల్ల మంచి కథలు నా దగ్గరకు వస్తున్నాయి. ‘సర్ ..మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని క్యారెక్టర్స్ రాస్తున్నాం’ అని యంగ్ రైటర్స్ చెప్పడం గొప్ప సంతృప్తినిస్తున్నది. సినిమాల విషయంలో నేను డబ్బు గురించి అస్సలు ఆలోచించను. మంచి కథలో భాగం కావడమే ముఖ్యమని భావిస్తాను.
ఇటీవల విడుదలైన ‘సామజవరగమన’ చిత్రంలో నా పాత్రకు మంచి పేరొచ్చింది. కాస్త యంగ్‌లుక్‌లో కనిపించడానికి పదికిలో బరువు తగ్గాను. ఈ సినిమాతో నరేష్ వెర్షన్ 2.0 మొదలైందని చాలా మంది నాతో చెప్పారు (నవ్వుతూ). ‘ఇండస్ట్రీకి ఎస్వీరంగారావు తర్వాత మీ రూపంలో ఆ స్థాయి నటుడు దొరికాడు’ అంటూ ఈ మధ్యే ఓ పెద్దాయన నాకు మెసేజ్ పెట్టారు. ఆ ప్రశంస ఎంతో ఆనందాన్నిచ్చింది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్నా. ఏ పాత్రలో అయినా పరిపూర్ణత కనబరిచి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవాలన్నదే నటుడిగా నా అభిమతం.