‘బిగ్ బాస్’ ఫేమ్ వీజే సన్ని హీరోగా నటిస్తున్న సినిమా ‘అన్‌స్టాపబుల్’. ఈ చిత్రంలో సప్తగిరి, పోసాని కృష్ణమురళి, అక్షా ఖాన్, మణిచందన తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఏ2బీ ఇండియా ప్రొడక్షన్ పతాకంపై రంజిత్ రావ్ బి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షేక్ రఫీ, బిట్టు న్యావనంది సహ నిర్మాతలు. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హీరో తనీష్, రచయిత విజయేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ క్లాప్‌నిచ్చారు.
ఈ సందర్భంగా దర్శకుడు డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ..‘కొత్తవాళ్లతో పాటు సీనియర్ ఆర్టిస్టులతో ఈ సినిమాను పూర్తి వినోదాత్మకంగా రూపొందిస్తున్నాం. వచ్చే నెల 9వ తేదీ నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించబోతున్నాం. జూలై చివరకు సినిమా షూటింగ్ పూర్తి చేసి దసరా పండక్కి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు. హీరో వీజే సన్ని మాట్లాడుతూ…‘ప్రస్తుతం నేను దిల్ రాజు, హరీష్ శంకర్ వెబ్ సిరీస్ ‘ఏటీఎమ్’లో నటిస్తున్నాను. ఇప్పుడీ సినిమాలో అవకాశం రావడం సంతోషంగా ఉంది. బిగ్ బాస్ షో తర్వాత నేను నటుడిగా నిరూపించుకునే అవకాశం దొరుకుతున్నది. సినిమా మీద ఇష్టం ఉన్న దర్శక నిర్మాతలతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది’ అన్నారు.