“విశ్వం’ సినిమా మా అందరి అంచనాలను అందుకుంది. కామెడీతో పాటు మదర్, ఫాదర్ సెంటిమెంట్ హృదయాన్ని కదలించిందని చాలా మంది చెబుతున్నారు. ఈ దసరాకు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ సినిమా చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు హీరో గోపీచంద్. ఆయన తాజా చిత్రం ‘విశ్వం’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీనువైట్ల మాట్లాడుతూ ‘అన్ని చోట్ల కలెక్షన్స్ బాగున్నాయని డిస్ట్రిబ్యూటర్ చెబుతున్నారు. కథలోని ఎమోషన్స్, సెంటిమెంట్‌కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. ట్రైయిన్ ఎపిసోడ్ కడుపుబ్బా నవ్వించిందని చెబుతున్నారు.
ఒక్క నిమిషం కూడా సినిమా బోర్ కొట్టలేదని ప్రేక్షకులు చెప్పడం ఆనందంగా ఉంది. ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని మేమంతా నమ్మకంగా ఉన్నాం’ అని అన్నారు. ఈ సినిమాలోని మదర్ సెంటిమెంట్ తనను కదిలించిందని, ప్రేక్షకులు కూడా అదే రీతిలో ఫీలవుతున్నారని కథానాయిక కావ్య థాపర్ చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తున్నదని, తమ టీమ్ అందరికి ఈ రోజు ఒక పండగలా ఉందని నిర్మాత వేణు దోనేపూడి పేర్కొన్నారు.