Vishwambhara | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న విశ్వంభర చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ‘అంజి’ తర్వాత చిరు నుంచి రాబోతున్న ఈ సోషియో ఫాంటసీ అడ్వెంచర్ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఆ మధ్య టీజర్ విడుదల కాగా, దానిపై కాస్త నెగెటివ్ టాక్ వచ్చింది. అందుకే మూవీపై ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. దసరా వరకు చిత్రాన్ని రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. అయితే తాజాగా ఈ చిత్రాన్ని గ్లోబల్ లెవెల్‌కు తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. ప్రపంచ ప్రఖ్యాత కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ‘విశ్వంభర’ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు చిత్ర నిర్మాత విక్రమ్ కుమార్.
ఈ సినిమాకు సంబంధించిన ఎపిక్ రివీల్‌ను ఆయన కేన్స్ స్టేజీపై చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఆయన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై కనిపించడంతో ఒక్కసారిగా ‘విశ్వంభర’ మూవీ అంతర్జాతీయ స్థాయిలో సౌండ్ చేస్తుంది. 78వ కేన్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ మే 13న అట్టహాసంగా ప్రారంభం కాగా, ఈ వేడుక మే నెల 24 వరకూ జరగనుంది. ఇప్పటికే పరువులు ఇండియన్ ఫిలిం స్టార్స్ కేన్స్-2025లో సందడి చేశారు. ఇప్పుడు ‘విశ్వంభర’ సినిమా కేన్స్ చలన చిత్రోత్సవానికి వెళుతుందని తెలియడంతో మెగా మాస్ సరిహద్దులను దాటుకుని ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతోందంటూ పోస్ట్ పెడుతున్నారు. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి, ప్రమోషన్స్ షురూ చేయలేదని కాస్త నిరాశలోనూ ఉన్నారు ఫ్యాన్స్.
దర్శకుడు వశిష్ట ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. “మెగా మాస్ బియాండ్ యూనివర్స్” అనే ట్యాగ్ లైన్ తో ప్రచారం చేస్తున్న ఈ సినిమా, పేరుకు తగ్గట్టే సరిహద్దులు చెరిపేసి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. #VishwambharaCannes2025 అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. ఈ పరిణామం తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచేదిగా ఉందని విశ్లేషకులు అంటున్నారు.