Vishwambara | మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ సోషియో-ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘విశ్వంభర’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా విడుదల తేదీ విషయంలో కొనసాగుతున్న అనిశ్చితి మెగా ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనే అంశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్‌ను మరోసారి ఫాంటసీ ప్రపంచంలో చూడబోతున్నామని అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయితే షూటింగ్ పూర్తయినప్పటికీ విడుదల తేదీపై ఇంకా స్పష్టత లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
మొదట ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆగస్టు రిలీజ్‌పై కూడా వార్తలు వినిపించాయి. కానీ చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో ఆ వార్తలన్నీ కేవలం ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం, ‘విశ్వంభర’ను ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. దసరా సీజన్‌కు భారీ చిత్రాలకు మంచి మార్కెట్ ఉండటంతో ఈ పండుగను లక్ష్యంగా పెట్టుకున్నారని టాక్ వినిపిస్తోంది.దీనికి ప్రధాన కారణం రాబోయే నెలల్లో టాలీవుడ్లో భారీ చిత్రాలు క్యూ కడుతుండడం. డిసెంబర్ నుంచి వరుస స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అలాగే 2027 సంక్రాంతి, సమ్మర్ సీజన్లు కూడా ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్టులతో బుక్ అయ్యాయి. దీంతో ‘విశ్వంభర’కు సరైన విడుదల తేదీ ఎంపిక చేయడం మేకర్స్‌కు సవాలుగా మారిందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న మరో భారీ చిత్రం కూడా వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో రెండు చిత్రాల మధ్య తగినంత గ్యాప్ ఉండేలా ప్లానింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో దసరా సీజన్ లేదా ఈ ఏడాది చివరిలోని మరో అనుకూలమైన తేదీ మాత్రమే ‘విశ్వంభర’కు అందుబాటులో ఉన్న ఉత్తమ ఎంపికగా కనిపిస్తోంది. అభిమానులు కూడా ఇకపై మరిన్ని వాయిదాలు లేకుండా సినిమాను త్వరగా విడుదల చేయాలని కోరుతున్నారు.ఇక ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం.