Vishwambara | మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభరపై మరోసారి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారనే వార్తలు ఇటీవల వైరల్‌గా మారాయి. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తోంది. చాలా కాలం క్రితమే విడుదల కావాల్సిన ఈ సినిమా, పలు కారణాలతో వరుసగా వాయిదా పడుతూ వస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం టాలీవుడ్లో సీక్వెల్స్ ట్రెండ్ బలంగా కొనసాగుతున్న నేపథ్యంలో, ‘విశ్వంభర’ను కూడా రెండు భాగాలుగా తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తున్నారనే ప్రచారం జోరందుకుంది.
అయితే ఈ వార్తలపై దర్శకుడు వశిష్ట తాజాగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. “రెండు పార్ట్స్‌గా వస్తున్న విశ్వంభర” అంటూ సోషల్ మీడియాలో వచ్చిన ఓ పోస్టుకు స్పందించిన ఆయన.. “అవునా.. నిజమా?” అంటూ వెటకారంగా రిప్లై ఇచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలయ్యే ఆలోచన లేదనే విషయం స్పష్టమైంది. ఇక సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినప్పటికీ, విడుదల మాత్రం ఇంకా ఆలస్యమవుతోంది. దీనికి ప్రధాన కారణం భారీ స్థాయిలో జరుగుతున్న విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ పనులేనని సినీ వర్గాలు చెబుతున్నాయి. సినిమా మొత్తం విజువల్ ఫాంటసీ ప్రపంచం నేపథ్యంలో తెరకెక్కుతుండటంతో, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదనే ఉద్దేశంతో మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం.
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వీఎఫ్ఎక్స్ పనులను పర్యవేక్షిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రేక్షకులకు సరికొత్త విజువల్ అనుభూతి ఇవ్వాలనే లక్ష్యంతో ప్రతి ఫ్రేమ్‌పై జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం ‘హను-మాన్’ ఫేమ్ గౌర హరిని కూడా రంగంలోకి దింపినట్లు సమాచారం. మొత్తానికి ‘విశ్వంభర’ సాధారణ ఫాంటసీ చిత్రం కాకుండా, తెలుగు ప్రేక్షకులకు భారీ విజువల్ విందుగా నిలవబోతుందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.