విశ్వక్సేన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకుడు. షైన్‌స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలోని కొన్ని ఎపిసోడ్స్‌లో విశ్వక్సేన్ లైలా అనే లేడీ గెటప్‌లో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమా ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తున్నది. గురువారం ట్రైలర్‌ను విడుదల చేశారు. బ్యూటీపార్లర్ నడుపుతున్న సోనూ మోడల్ ఓ ఎమ్మెల్యే హత్య కేసులో ఇరుక్కుంటాడు. దీంతో అతని మనుషులు సోనూను చంపేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. వారి బారి నుంచి రక్షించుకోవడానికి సోనూ లైలాగా లేడీ గెటప్‌లోకి మారిపోతాడు. ఈ నేపథ్యంలో ట్రైలర్ ఆసాంతం నవ్వుల్ని పంచింది. విశ్వక్సేన్ మాట్లాడుతూ ‘లైలా మీ అందరిని తప్పకుండా నవ్విస్తుంది. లైలా గెటప్ వేసుకోవడానికే రెండు గంటల సమయం పట్టేది. ఈ సినిమాలోని ‘అటక్ పటక్’ అనే పాటను త్వరలో విడుదల చేయబోతున్నాం. ఆ పాటను నేనే రాశా’ అన్నారు. ఆకాంక్షశర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతాన్నందించారు.