Vishwak Sen | ‘ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. నా విష్‌లిస్ట్‌లో ఉన్న సినిమా ఇది. దర్శకుడు కథ చెప్పిన వెంటనే ‘సినిమా చేస్తున్నాం’ అని చెప్పా. వాలెంటైన్ డే రోజు బ్యాచిలర్స్ అందరూ తమకు ఎవరూ తోడు లేరని బాధపడుతుంటారు. కానీ ఈ ప్రేమికుల రోజున మీకు లైలా తోడుంటుంది’ అన్నారు విశ్వక్సేన్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని షైన్‌స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మించారు.
ఆకాంక్షశర్మ కథానాయిక. ఫిబ్రవరి 14న విడుదలకానుంది. ఈ సినిమాలోని ‘ఇచ్చుకుందాం బేబీ..’ అనే పాటను గురువారం లాంచ్ చేశారు. లియోన్ జేమ్స్ స్వరపరచిన ఈ పాటను పూర్ణాచారి రచించారు. ఆదిత్య ఆర్కే, మానసి ఆలపించారు. ఈ సందర్భంగా విశ్వక్సేన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో లైలా పాత్ర కోసం మేకప్‌కే రెండు గంటలు పట్టేదని, ఓసారి షూటింగ్ లొకేషన్ నుంచి లైలా గెటప్‌లో తన నాన్నకు వీడియో కాల్ చేస్తే ఆయన గుర్తుపట్టలేదని విశ్వక్సేన్ అన్నారు.
ఈ కథను కొందరు హీరోలకు చెబితే..లేడీ గెటప్ వేయాల్సిరావడం వల్ల ఒప్పుకోలేదని, విశ్వక్సేన్ వల్లే ఈ పాత్రను తెరకెక్కించగలిగానని దర్శకుడు తెలిపారు. విశ్వక్సేన్ కెరీర్లో నిలిచిపోయే పాత్ర ఇదని నిర్మాత సాహు గారపాటి పేర్కొన్నారు.