Vishwak Sen | ప్రముఖ తెలుగు నటుడు, కామెడీ విలన్‌గా ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించిన ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో అతని ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణిస్తోంది. ప్రస్తుతం బోడుప్పల్‌లోని ఆర్బీఎం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు అత్యవసరంగా కిడ్నీ మార్పిడి అవసరం ఏర్పడింది. వెంకట్ కుమార్తె స్రవంతి తెలిపిన వివరాల ప్రకారం, ఆయన రెండు కిడ్నీలు పూర్తిగా పనిచేయకపోవడంతో గత కొన్నేళ్లుగా డయాలసిస్ చేయిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కిడ్నీ మార్పిడి తప్ప మరో మార్గం లేదని ఆమె పేర్కొంది. అయితే డోనర్ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, తమ కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతోందని వాపోయారు.
వెంకట్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన యువ హీరో విశ్వక్ సేన్ మంచి మనసు చాటుకున్నారు. ఆయన రూ.2 లక్షల చెక్కును వెంకట్ కుటుంబానికి అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విశ్వక్ చేసిన సాయం పట్ల పలువురు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇక వెంకట్ ఆపరేషన్‌కి కావల్సినంత మనీని ప్రభాస్ ఏర్పాటు చేస్తాడని అనేక వార్తలు వచ్చాయి.. కానీ ఈ వార్తల్లో నిజం లేదని, వెంకట్ భార్య సువర్ణ , కుమార్తె స్రవంతి స్పష్టం చేశారు. ఎవరో “ప్రభాస్ మేనేజర్” పేరుతో ఫోన్ చేసి తమని తప్పుదారి పట్టించారని చెప్పారు. అయితే ప్రభాస్‌కు ఈ విషయం నిజంగా తెలియకపోవచ్చు, తెలిస్తే ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
సినీ పరిశ్రమ పెద్దలు స్పందించాలంటూ వెంకట్ కుటుంబం వేడుకుంటుంది. టాలీవుడ్ సీనియర్ ప్రముఖులు, పెద్దలు, నటులు ముందుకొచ్చి సహాయం చేయాలంటూ కన్నీటి విజ్ఞప్తి చేశారు. తమ ఇల్లు అమ్మినా కిడ్నీ మార్పిడి ఖర్చులకు సరిపోవడం లేదని చెప్పారు. ప్రస్తుతం డోనర్ కోసం అనేక సంస్థలను సంప్రదిస్తున్నాం అని తెలిపారు. ఫిష్ వెంకట్ టాలీవుడ్లో కమెడియన్‌గా, విలన్‌గా మంచి గుర్తింపు పొందారు. బన్నీ, గబ్బర్ సింగ్, దిల్, కంచె, అదుర్స్, ఆడో రకం ఈడో రకం, ఖైదీ నెం.150 వంటి పలు చిత్రాల్లో తనదైన స్టైల్‌తో అలరించారు. ఇటీవల ‘కాఫీ విత్ ఏ కిల్లర్’ అనే వెబ్ సిరీస్, ‘మా వింత గాధ వినుమా’ వంటి చిత్రాల్లో కనిపించారు.