Vishnu Vishal | కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో, సూపర్ స్టార్ రజనీకాంత్ అతిథి పాత్రలో నటించిన ‘లాల్ సలామ్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమవడంతో పాటు భారీ నష్టాలను కూడా చవిచూసింది.కేవలం థియేటర్లలో మాత్రమే కాదు, ఓటీటీ విడుదల విషయంలోనూ ఈ చిత్రం అనేక సమస్యలను ఎదుర్కొంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ‘లాల్ సలామ్’ డిజిటల్ హక్కులను దక్కించుకున్నప్పటికీ, అనుకోని కారణాల వల్ల ఆ వేదికపై సినిమా విడుదల కాలేదు. చివరకు ఎలాంటి ప్రచారం లేకుండా ఈ చిత్రం సన్ నెక్ట్స్లో స్ట్రీమింగ్కు వచ్చింది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు విశాల్, ‘లాల్ సలామ్’ పరాజయం తనను ఎంతగానో బాధించిందని వెల్లడించారు. సినిమా ఫలితానికి తాను బాధ్యత వహిస్తూ నెట్ఫ్లిక్స్ ప్రతినిధులకు స్వయంగా క్షమాపణలు చెప్పినట్లు తెలిపారు.ఈ సినిమా థియేటర్లలోనే కాదు, ఓటీటీలో కూడా ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లలేకపోయింది. అందుకే నేను నెట్ఫ్లిక్స్ సంస్థకు క్షమాపణలు చెప్పాను. ఒక హీరోగా ఈ సినిమా పరాజయానికి నేనే బాధ్యత తీసుకుంటానని, త్వరలోనే మంచి సినిమాతో తిరిగి వస్తానని వారికి చెప్పాను అని విష్ణు విశాల్ వెల్లడించారు. అయితే నెట్ఫ్లిక్స్ ప్రతినిధులు ఆయనను ఓదార్చినట్లు కూడా తెలిపారు. ఈ సినిమా కేవలం విష్ణు విశాల్ సినిమా మాత్రమే కాదని, ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా కీలక పాత్ర పోషించారని, ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని తాము పెట్టుబడి పెట్టామని చెప్పినట్లు వెల్లడించారు. అందువల్ల పరాజయానికి పూర్తిగా తానే బాధ్యత వహించాల్సిన అవసరం లేదని వారు సూచించినట్లు తెలిపారు.
అయినప్పటికీ, ఇది నా సినిమా. ఇందులో జరిగిన తప్పులను అర్థం చేసుకుని ముందుకు సాగడం నా బాధ్యత అని విష్ణు విశాల్ స్పష్టం చేశారు. ఒక హీరో తన సినిమా వైఫల్యాన్ని బహిరంగంగా అంగీకరించి ఓటీటీ సంస్థకు క్షమాపణలు చెప్పడం సినీ పరిశ్రమలో అరుదైన విషయంగా మారింది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ‘లాల్ సలామ్’ చిత్రానికి సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. సుమారు రూ.80 నుంచి రూ.90 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా సుమారు రూ.17 కోట్లకు పైగా మాత్రమే వసూలు చేయగా, ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.30 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు మాత్రమే సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక నెట్ఫ్లిక్స్లో సినిమా ఎందుకు విడుదల కాలేదనే విషయంపై కూడా గతంలో దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ స్పందించారు. సినిమాకు సంబంధించిన కీలకమైన ఫుటేజ్ ఉన్న హార్డ్ డిస్క్ పోయిందని, ఓటీటీ కోసం సిద్ధం చేసిన ప్రత్యేక ‘డైరెక్టర్స్ కట్’ వెర్షన్ పనులు ఆలస్యమయ్యాయని ఆమె వెల్లడించారు. ఈ కారణంగానే నెట్ఫ్లిక్స్ ఒప్పందంలో మార్పులు చోటుచేసుకుని, చివరకు సినిమా సన్ నెక్ట్స్లో విడుదలైనట్లు సమాచారం.