Vishal | కోలీవుడ్ నటుడు విశాల్, హీరోయిన్ సాయి ధన్సికల ప్రేమ కథ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. త్వరలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనుందని అనుకున్నారు అభిమానులు. ఇటీవలే ఓ సినిమా ఈవెంట్లో ఈ జంట తమ ప్రేమను అధికారికంగా ప్రకటిస్తూ, ఆగస్ట్ 29న వివాహం జరగనుంది అని వెల్లడించారు. కానీ తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం, ఈ పెళ్లి వాయిదా పడే అవకాశం ఉంది. తాజాగా ఓ ఈవెంట్లో మాట్లాడిన విశాల్.. తొమ్మిదేళ్లుగా నడిగర్ సంఘం భవన నిర్మాణం కోసం నా పెళ్లిని వాయిదా వేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఆ భవనం పూర్తికావడానికి రెండు నెలలు సమయం పడుతుంది.
నేను ఇదివరకే బుక్ చేసుకున్నాను. ఆ భవనంలోనే జరిగే మొదటి పెళ్లి నాదే అవుతుంది, ఇది నాకు గౌరవంగా ఉంటుంది, అని పేర్కొన్నారు. ప్రస్తుతం నడిగర్ సంఘం భవన మూడో అంతస్తులో పెళ్లి మండపం నిర్మాణం జరుగుతోంది అని అన్నారు. ఆయన కామెంట్స్‌ని బట్టి చూస్తే విశాల్ పెళ్లి వాయిదా పడటం ఖాయమనే ప్రచారం కోలీవుడ్‌లో ఊపందుకుంది. విశాల్ పుట్టినరోజు ఆగస్ట్ 29న కావడంతో, ఆ రోజే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ, నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తయ్యేంతవరకూ ఆగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఆగస్ట్ 29న విశాల్ రెండు ముఖ్యమైన విషయాలను ప్రకటించనున్నట్టు తెలుస్తుంది. అందులో ఒకటి నడిగర్ సంఘం భవన ప్రారంభ తేదీ కాగా రెండోది తన పెళ్లి కొత్త తేదీ. ఇవి రెండు “గుడ్ న్యూస్‌లు”గా అభిమానులు భావిస్తున్నారు.
విశాల్ గతంలో హీరోయిన్ అనీషా రెడ్డితో నిశ్చితార్థం జరుపుకున్నాడు. కానీ వివాహానికి ముందే వారు విడిపోయారు. అనంతరం సాయి ధన్సికతో పరిచయం పెరిగి ప్రేమగా మారింది. వీరిద్దరి పెళ్లి గురించి ఇప్పటికే పలు ఊహాగానాలు వచ్చాయి. చివరకు ఇటీవలే వీరిద్దరూ ఒక కార్యక్రమంలో అధికారికంగా తమ వివాహాన్ని ప్రకటించారు.పెళ్లి తర్వాత కూడా సాయి ధన్సిక నటన కొనసాగిస్తారు అని విశాల్ స్పష్టంచేశారు. ఈ భవనానికి తన పెళ్లి ద్వారా కొత్త ప్రారంభం ఇవ్వాలనుకున్న విశాల్.. “9 ఏళ్లు ఎదురుచూసాను… ఇంకో రెండు నెలలు ఆగలేనా?” అని భావోద్వేగంగా చెప్పుకొచ్చారు