Vishal | తమిళ నటుడు విశాల్ తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా సుపరిచితం. పందెం కోడి చిత్రంతో ఆయన టాలీవుడ్ ప్రేక్షకులకి దగ్గరయ్యారు. ఇప్పటికీ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తన ప్రతి సినిమాని తెలుగులో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇటీవల మద గజ రాజా అనే కామెడీ చిత్రంలో నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అయితే ఇటీవల విశాల్ పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు అనేక వార్తలు వచ్చాయి. అందుకు కారణం కొన్ని రోజుల క్రితం విశాల్ గుర్తు పట్టలేని విధంగా చాలా వీక్‌గా కనిపించి అందరికి షాక్ ఇచ్చారు. ఆ తర్వాత కోలుకున్న ఆయన మిస్ కువాగం, ట్రాన్స్‌జెండర్ బ్యూటీ కాంటెస్ట్ కు గెస్ట్ గా వెళ్లాడు.
ఈవెంట్ జరుగుతున్న సమయంలో ఉన్నట్టుండి వేదికపైనే కుప్పకూలిపోయాడు విశాల్. ఆ సమయంలో విశాల్‌ని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి…ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత మళ్లీ ఆ షోకు వెళ్లి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల స్పృహ తప్పి పడిపోయారని, ఎండ, వేడి, ఉక్కపోతతో.. ఒక్కసారిగా నీరసం అయి అలా కుప్పకూలాడని అన్నారు. అయితే ప్రస్తుతం విశాల్ ఆరోగ్యంగానే ఉన్నాడు. ఇక విశాల్ పెళ్లి వార్తలు కొద్ది రోజులుగా నెట్టింట హల్చల్ చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో ఆయన పెళ్లిపై స్పందించారు. విశాల్ మదురై మీనాక్షి అమ్మవారి దర్శనానికి వచ్చారు. “చెంగల్పట్టు జిల్లా కార్యదర్శి సతీష్ కుమార్ పెళ్లి కోసం మదురై వచ్చా. మీనాక్షి అమ్మవారిని దర్శించుకోకుండా ఎలా వెళ్లగలను? అమ్మ ఇచ్చిన పట్టుచీరను అమ్మవారికి సమర్పించి దర్శనం చేసుకున్నాను అని చెప్పారు.
ఇక నటుల సంఘం భవనం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయ్యాకే పెళ్లి చేసుకుంటానని విశాల్ చెప్పారు. భవనం త్వరలో ప్రారంభం కానుండటంతో, తన పెళ్లి త్వరలో జరుగుతుందని ప్రకటించారు. కొంతకాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని, ఆమెతో త్వరలో పెళ్లి జరుగుతుందని విశాల్ తెలిపారు. రెండు నెలల్లో నటుల సంఘం భవన నిర్మాణం పూర్తయి, ప్రారంభోత్సవం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్‌లో పెళ్లి జరుగుతుందని విశాల్ చెప్పారు. నటుల సంఘం భవన నిర్మాణం పూర్తయ్యాక సెప్టెంబర్‌లో పెళ్లి. దీనిపై అధికారిక ప్రకటన విశాల్ పుట్టినరోజున వెలువడుతుంది అంటున్నారు. మరి విశాల్ ప్రేమించిన అమ్మాయి ఎవరనే ఆసక్తి అందరిలో ఉంది.