Vishal | తమిళ సినీ ఇండస్ట్రీలో యాక్షన్ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా ప్రత్యేక గుర్తింపు పొందిన విశాల్, ప్రస్తుతం తీవ్ర ఆర్థిక లీగల్ సంక్షోభంలో చిక్కుకున్నాడు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ తరఫున గతంలో తీసుకున్న రుణం, ఆపై లైకా ప్రొడక్షన్స్‌తో జరిగిన ఒప్పందం ఉల్లంఘన కేసు కోర్టులో ఊహించని మలుపు తీసుకుంది. విశాల్ గతంలో ప్రముఖ ఫైనాన్షియర్ అన్బుచెళియన్ వద్ద నుండి సుమారు ₹21 కోట్లు రుణం తీసుకున్నారు.సమయానికి చెల్లించలేకపోవడంతో ఆ మొత్తాన్ని లైకా ప్రొడక్షన్స్ క్లియర్ చేసింది. దీనికి ప్రతిగా విశాల్ భవిష్యత్తులో నిర్మించే సినిమాల డిస్ట్రిబ్యూషన్ హక్కులు పూర్తిగా లైకాకే ఇవ్వాలని ఒప్పందం కుదిరింది.
అయితే, ‘వాగై సూడుం’ సినిమాను విశాల్ స్వయంగా విడుదల చేయడంతో లైకా కోర్టును ఆశ్రయించింది. విశాల్ ఒప్పందాన్ని ఉల్లంఘించాడని,తీసుకున్న మొత్తం 30% వడ్డీతో తిరిగి చెల్లించాలని కోరింది. కొన్ని నెలలుగా సాగుతున్న విచారణకు తాజాగా కీలక తీర్పు వెలువడింది. విశాల్ వెంటనే ₹21.30 కోట్లు 30% వడ్డీతో చెల్లించాలని సింగిల్ బెంచ్ ఆదేశించింది. ఈ తీర్పుతో విశాల్‌కు భారీ షాక్ తగిలింది. విశాల్ టీం ఈ తీర్పుపై అపీల్ దాఖలు చేసుకుంది.అదే సమయంలో విశాల్ తరఫున న్యాయవాదులు ..“విశాల్ ధనవంతుడు కాదు.. ఒకేసారి ఇంత పెద్ద మొత్తం చెల్లించడం సాధ్యం కాదు” అని కోర్టులో వాదించారు. దీనిపై ద్విసభ్య బెంచ్ “అలా అయితే విశాల్ దివాళా ప్రకటించేందుకు సిద్ధమా?” అని ప్రశ్నించడం కోర్టులో ఆసక్తికర చర్చకు దారితీసింది.
సింగిల్ బెంచ్ తీర్పుకు తాత్కాలిక స్టే ఇచ్చినా విశాల్ తప్పనిసరిగా ₹10 కోట్లు వెంటనే డిపాజిట్ చేయాలి అని కోర్టు ఆదేశించింది. అదేవిధంగా విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ నిర్మించే సినిమాలు అప్పు పూర్తిగా క్లియర్ అయ్యే వరకు థియేటర్స్ లేదా ఓటీటీలో రిలీజ్ చేయకూడదని స్పష్టం చేసింది. ఇందువల్ల విశాల్ నిర్మాణ సంస్థ కార్యకలాపాలు పాక్షికంగా నిలిచిపోయినట్టే. ఇటీవలే విశాల్ హీరోయిన్ సాయి ధన్షికతో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ లీగల్ సంక్షోభం కారణంగా వారి పెళ్లి వాయిదా పడవచ్చని కోలీవుడ్ మీడియా వార్తలు చెబుతున్నాయి. మరి విశాల్ తదుపరి నిర్ణయం ఏమిటి? విశాల్ లైకాతో రాజీకి వెళ్తారా? లేక లీగల్ పోరాటం కొనసాగిస్తారా? అనే దానిపై చర్చ నడుస్తోంది. రాబోయే రోజులలో కోర్టు నిర్ణయాలు, విశాల్ స్పందన కోలీవుడ్‌లో ప్రధాన చర్చగా మారడం ఖాయం.