Vishal Dadlani | నీట్ (NEET) పేపర్ లీకేజీ వివాదంపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించినందుకు గానూ, ప్రముఖ సంగీత దర్శకుడు, సింగర్ విశాల్ దద్లానీని ‘ఇండియన్ ఐడల్ 16’ జడ్జిల ప్యానెల్ నుండి తొలగించారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిపిందే. అయితే దీనిపై విశాల్ దద్లానీ తాజాగా స్పందిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఆయన మొదట ఏడుస్తున్నట్లు నటిస్తూ, ఆ తర్వాత ఒక్కసారిగా నవ్వుతూ… నేను ఇక్కడే ఉన్నాను బేబీ! అంటూ తనను ట్రోల్ చేసిన వారికి గట్టి కౌంటర్ ఇచ్చాడు. ‘ఆన్లైన్లో కనిపించే ప్రతిదాన్ని నమ్మకండి. ఇక్కడ చాలా మానిపులేషన్ జరుగుతోంది. నిజాయితీగా మన పోరాటాన్ని కొనసాగిద్దాం, చెప్పాల్సింది ధైర్యంగా చెబుదాం’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. విశాల్ పెట్టిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆయన ధైర్యాన్ని మెచ్చుకుంటుండగా, మరికొందరు బాలీవుడ్లో ప్రభుత్వం తప్పులను ప్రశ్నించే ఏకైక వ్యక్తి మీరేనంటూ కామెంట్లు పెడుతున్నారు.
వివాదం ఏమిటంటే… ఇటీవల నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై విశాల్ దద్లానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులైన విద్యార్థులకు మద్దతుగా నిలుస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. ప్రతి సంవత్సరం ఇలా జరగడం తప్పని, దీనిపై ప్రభుత్వ సంస్థలు బాధ్యత తీసుకోకపోవడం మరీ దారుణమని మండిపడ్డారు. అధికారంలో ఉన్న కొందరు చదువుకోని వల్లే దేశం ఇలా నాశనమవుతోందని, కులమతాలకు అతీతంగా కేవలం చదువుకున్న, సమర్థులైన నాయకులకే ఓటు వేయాలని ఆయన ఓటర్లను కోరారు. అయితే మోడీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల వల్లే ఆయనను షో నుంచి తొలగించారనే పుకార్లు వైరల్ కాగా చేయగా, వాటన్నింటికీ విశాల్ తనదైన శైలిలో ఫుల్స్టాప్ పెట్టారు.