Rama Naidu | విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియోకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈ నోటీసులకు సంబంధించి స్టూడియో యాజమాన్యం నుంచి రెండు వారాల్లో వివరణ కోరినట్లు సమాచారం. రామానాయుడు స్టూడియోకు చిత్ర నిర్మాణ పరిశ్రమ, స్టూడియో నిర్మాణం కోసం ప్రభుత్వం 34 ఎకరాలకు పైగా భూమిని కేటాయించింది.
అయితే ఇందులో 15.17 ఎకరాల భూమిని స్టూడియో కోసం కాకుండా.. హౌసింగ్ లేఅవుట్ కోసం మార్పులు చేయాలని యాజమాన్యం కోరడంతో ఈ భూమి కేటాయింపును రద్దు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, నిర్దేశిత ప్రయోజనం కోసం కేటాయించిన భూమిని వేరే అవసరాలకు ఉపయోగిస్తే దాన్ని రద్దు చేయవచ్చని స్పష్టం చేయడంతో, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి. సిసోదియా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాల ఆధారంగా కలెక్టర్ నోటీసులు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ నోటీసులకు సంబంధించి సురేష్ ప్రొడక్షన్స్ స్పందిచాల్సి ఉంది.