Virosh | టాలీవుడ్లో మోస్ట్ క్యూట్ కపుల్‌గా పేరొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మంధాన ఇటీవల వివాహ బంధంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో అత్యంత సన్నిహితుల మధ్య హిందూ మరియు కొడవ సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి ఘనంగా జరిగింది. అనంతరం విజయ్ స్వగ్రామంలో సత్యనారాయణ వ్రతం నిర్వహించగా, హైదరాబాద్‌లో రిసెప్షన్‌ను ఘనంగా నిర్వహించారు. పెళ్లి వేడుకలతో బిజీగా గడిపిన ఈ జంట ప్రస్తుతం హనీమూన్ కోసం థాయ్‌లాండ్‌కు వెళ్లి రిలాక్స్ అవుతున్నారు. అక్కడి నుంచి షేర్ చేస్తున్న క్యూట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ జంట ప్రత్యేకంగా నిలిచింది వారి హనీమూన్ స్టైల్ వల్లే. సాధారణంగా హనీమూన్ అంటే కొత్త దంపతులు ఇద్దరే వెళ్లి ఏకాంతంగా గడుపుతారు. కానీ విజయ్–రష్మిక జంట మాత్రం ఈ ట్రెండ్‌ను మార్చేశారు.
ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ వోగ్ వెల్లడించిన వివరాల ప్రకారం, వీరు హనీమూన్‌ను ‘బడ్డీమూన్’గా మార్చుకున్నారు. థాయ్‌లాండ్‌లోని ‘కో సముయ్కి ఈ జంట తమ ప్రాణస్నేహితులతో కలిసి ప్రత్యేక ట్రిప్‌ను ప్లాన్ చేసుకున్నారు. ఎయిర్‌బీఎన్‌బీ ద్వారా ఏర్పాటు చేసిన ప్రైవేట్ గెటవేలో వీరంతా కలిసి ఎంజాయ్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్లో ట్రెండ్ అవుతున్నాయి. అయితే హనీమూన్‌కు వెళ్లే సమయంలో కొత్త దంపతులు తమ సన్నిహిత స్నేహితులను కూడా వెంట తీసుకెళ్లడాన్ని ‘బడ్డీమూన్’ అంటారు. ‘బడ్డీ’ అంటే ఫ్రెండ్ అనే అర్థం రావడంతో ఈ పేరు వచ్చింది. పెళ్లి హడావుడిలో స్నేహితులతో గడపలేకపోయిన వారు, లేదా గ్రూప్‌గా సెలబ్రేట్ చేయాలని భావించే జంటలు ఈ ట్రెండ్‌ను ఎంచుకుంటున్నారు.
ఇప్పుడు విజయ్–రష్మిక జంట ఈ ‘బడ్డీమూన్’ ద్వారా మరోసారి ట్రెండ్ సెట్ చేయడంతో, నెటిజన్లు వీరిని ప్రశంసిస్తున్నారు. ప్రేమతో పాటు స్నేహాన్నీ సమానంగా సెలబ్రేట్ చేస్తున్న ఈ జంట స్టైల్ నిజంగా ప్రత్యేకమని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక విజయ్ రష్మికలు త్వరలో రణబాలి అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించబోతున్నారు. బడ్డీమూన్ తర్వాత ఈ జంట షూటింగ్‌తో బిజీ కానున్నారు.