Virgin Boys | ప్రేక్షకులని థియేటర్‌కి రప్పించేందుకు ఒక్కొక్కరు ఒక్కో ప్లాన్ వేస్తుంటారు. అవి కొన్నిసార్లు వర్కవుట్ అవుతాయి, కొన్ని సార్లు కావు. అయితే యూత్‌ను లక్ష్యంగా చేసుకుని తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘వర్జిన్ బాయ్స్’ జూలై 11న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో వర్జిన్ మూవీ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రాజా దారపునేని మాట్లాడుతూ, జూలై 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు సినిమా చూసేందుకు థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు ప్రత్యేక బహుమతులు అందించనున్నట్లు తెలిపారు.
ఈ మూడు రోజుల్లో సినిమా చూసే ప్రేక్షకుల్లో 11 మంది అదృష్టవంతులకు ఐఫోన్లు బహుమతిగా ఇవ్వనున్నట్టు చెప్పుకొచ్చారు. అంతే కాదు, కొన్ని థియేటర్లలో సీటు దగ్గరే డబ్బులు పడే విధంగా ప్లాన్ చేశాం అని చెప్పుకొచ్చారు. ఎవరైన వచ్చి డబ్బులు ఇవ్వొచ్చు, లేదంటే స్టార్ హీరోల సినిమాలప్పుడు పేపర్స్ ఎలా ఎగురుతాయో అలా డబ్బులు కూడా ఎగరొచ్చు అని కామెంట్ చేశాడు. నిర్మాత ఆఫర్ల ప్రకటనతో థియేటర్లలో మనీ రెయిన్ అన్న క్యాంపెయిన్ వైరల్ అవుతోంది. థియేటర్లలో డబ్బులు పంచుతుంటే తొక్కిసలాట జరిగితే ఎవరిది బాధ్యత? లేదా ఒకరికి ఇచ్చిన డబ్బులు మరో వ్యక్తి లాక్కుంటే.. పరిస్థితి ఏంటి..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
స్పష్టమైన ప్లానింగ్ లేకపోతే అవాంఛనీయ పరిణామాలు జరిగే ప్రమాదం ఉందన్న చర్చ మొదలైంది. గతంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో స్టార్ హీరో అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సి వచ్చింది. కాబట్టి వర్జిన్ బాయ్స్ టీమ్ ముందుగానే పూర్తి భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. వర్జిన్ బాయ్ చిత్ర విషయానికి వస్తే.. ఈ సినిమా యూత్‌కు కనెక్ట్ అయ్యే విధంగా రూపొందించబడింది. డబుల్ మీనింగ్ డైలాగులు, బోల్డ్ కంటెంట్, ప్రేమ, కామెడీ, యూత్ థీమ్ మేళవింపుతో థియేటర్లలో సందడి చేసేందుకు రెడీగా ఉంది. ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీహన్ కామెడీ టైమింగ్ కూడా మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. గీతానంద్, మిత్రా శర్మ జంటగా నటించిన ఈ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహించారు.