Kashmir Terror Attack | జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాంలో జరిగిన భీకర ఉగ్రదాడిలో (Pahalgam Terror Attack) 28 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మంగళవారం, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న పర్యటకులపై ఉగ్రవాదులు అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ దాడిని సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై విరాటపర్వం దర్శకుడు వేణు వుడుగుల ఎక్స్ వేదికగా స్పందించాడు.
పహల్గాములో విహారయాత్రకు వచ్చిన వారు… తిరిగి రాలేదు. ఇది కేవలం రాజకీయ సమస్య కాదు, ఇది మానవతా సంక్షోభం. ప్రశాంతంగా జీవించాలనుకున్న వారి హృదయాలను తుపాకులు ధ్వంసం చేశాయి. తీవ్రవాదానికి మతం లేదు, భౌగోళిక సరిహద్దులు లేవు. ఎక్కడ మనిషి ప్రాణం గణాంకంగా మారిపోతుందో, అక్కడ మన మౌనం కూడా నిశ్శబ్దమైన నేరంగా మారుతుంది. జాతి గౌరవం తుపాకీ ద్వారా కాదు. దయతో, మానవత్వంతో, బాధితుల పట్ల కలిగిన స్పందనతో నిలబడుతుంది. ఇది కన్నీటిని మాటలుగా, మౌనాన్ని పోరాటంగా మార్చే కాలం. అంటూ వేణు వుడుగుల రాసుకోచ్చాడు.