వినోద్‌వర్మ, సాయికుమార్, అనసూయ భరద్వాజ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. జయశంకర్ దర్శకుడు. శ్రీనివాస్ రామిరెడ్డి, డి.శేషురెడ్డి మారంరెడ్డి, డా.తిమ్మప్పనాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్‌రెడ్డి నిర్మాతలు. ఏషియన్ సురేశ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఆదివారం ట్రైలర్‌ని విడుదల చేశారు. సైకలాజికల్, మైథలాజికల్ అంశాల కలగలుపుతో భిన్నమైన థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందిందని ట్రైలర్ చెబుతున్నది. ‘భూలోకంలో కృష్ణుడిగా అవతరించాలని మహావిష్ణువు సంకల్పించగానే, ఆ విషయం తెలుసుకున్న స్వర్గలోకానికి చెందిన ఆరుగురు దేవతలు తమను కూడా భూలోకానికి తీసుకెళ్లమని విష్ణువుని వేడుకుంటారు.
అవే.. కామ, క్రోథ, మోహ, లోభ, మద, మత్సర్యాలనే అరిషడ్వర్గాలు.’ అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ఓ అరుగురి కోర్కెలు అరిషడ్వార్గాలకు ప్రతీకలుగా కనిపిస్తాయి. ఆ ఆరుగురి నేపథ్యం ఏంటి? ఆ కోర్కెలు తీర్చే బాధ్యత తీసుకున్నదెవరు? ఈ ప్రశ్నలన్నీ ట్రైలర్ చూస్తే ఉత్పన్నమవుతాయి. ఈ చిత్రానికి కెమెరా: కృష్ణప్రసాద్, శివశంకర వరప్రసాద్, సంగీతం: అనూప్ రూబెన్స్, సమర్పణ: రామిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి.