2006లో వెంకటేశ్, వి.వి.వినాయక్ కాంబినేషన్లో వచ్చిన ‘లక్ష్మీ’ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. మళ్లీ 19ఏండ్ల తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అవుతునట్టు ఫిల్మ్ వర్గాల సమాచారం. ‘సంక్రాంతి వస్తున్నాం’ అంటూ రీజనల్ సినిమా రికార్డులన్నింటినీ బద్దలు చేసేశారు వెంకటేశ్. ప్రస్తుతం ఆయనతో సినిమా చేసేందుకు నిర్మాతలందరూ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే వెంకటేశ్‌తో నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) సినిమాను ఓకే చేసుకున్నారని తెలుస్తున్నది. ఆ సినిమాకే వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తారట. ఈ సారి కూడా ‘లక్ష్మీ’ స్థాయి మాస్ కథనే వెంకీకి వినాయక్ వినిపించినట్టు సమాచారం. నిజానికి వి.వి.వినాయక్ సినిమా చేసి చాలా కాలమైంది. హిందీ ‘ఛత్రపతి’ తర్వాత ఆయన మళ్లీ మెగా ఫోన్ పట్టలేదు. మళ్లీ వెంకీ సినిమాతో ఆయన దర్శకుడిగా తన ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నట్టు బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజానిజాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.