తేజ సజ్జ హీరోగా నటిస్తున్న సినిమా ‘హనుమాన్’. అమృత అయ్యర్ నాయికగా నటిస్తున్నది. ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై శ్రీమతి చైతన్య సమర్పణలో కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనుంది. సూపర్ హీరో మూవీగా పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం నుంచి ‘మ్యాన్ ఆఫ్ డూమ్’ మైఖేల్ అంటూ విలన్ పోస్టర్‌ను హీరో రానా విడుదల చేశారు. ఈ క్యారెక్టర్లో వినయ్ రాయ్ నటించారు. ‘బ్యాట్‌మ్యాన్’ సినిమాకు జోకర్, ‘సూపర్‌మ్యాన్’ సినిమాకు లూథర్లా హను మాన్కు మైఖేల్ విలన్‌గా ఆకట్టుకుంటాడని, అతని టెక్నాలజీ ఆశ్చర్యపరుస్తుందని చిత్రబృందం చెబుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉందీ చిత్రం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : దాశరథి శివేంద్ర, ఎడిటర్ : ఎస్బీ రాజు తలారి, సంగీతం : అనుదీప్ దేవ్, హరి గౌర, జై క్రిష్, కృష్ణ సౌరభ్.