‘నేటి దంపతుల్లో సంతానలేమి సమస్య ఎక్కువగా ఉంది. ఒక సర్వేప్రకారం ప్రతి పది జంటల్లో మూడు జంటలు ఇన్ఫెర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారు. వారందరూ ఈ సినిమాతో రిలేట్ అవుతారు’ అన్నారు హీరో విక్రాంత్. ఆయన నటించిన తాజా చిత్రం ‘సంతానప్రాప్తిరస్తు’ నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో మధుర శ్రీధర్‌రెడ్డి, నిర్విప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా గురువారం హీరో విక్రాంత్ విలేకరులతో ముచ్చటించారు. సినిమా మీద పాషన్‌తో అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి ఇండస్ట్రీకి వచ్చానని, హీరోగా తనకిది రెండో చిత్రమని తెలిపారు. ‘స్మెర్మ్ కౌంట్ తక్కువగా ఉండే హీరో కథ ఇది. ఎక్కడా అసభ్యతకు తావులేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్లు అందరూ చూసేలా ఉంటుంది.
కొత్తహీరోలు రెగ్యులర్ సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఆదరించరు. డిఫరెంట్ మూవీస్ చేయాలి. అందుకే అందరికి రిలేట్ అయ్యే ఈ కథను ఎంచుకున్నా. ఓ సెన్సిటివ్ ఇష్యూని ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా డీల్ చేశాం. చివరగా మంచి ఎమోషన్‌తో పాటు సందేశం కూడా అందిస్తుంది’ అన్నారు. ఈ సినిమాలో సంతానలేమి సమస్యతో బాధపడేవారిని హేళన చేయలేదని, ఇష్యూని సీరియస్‌గా చర్చిస్తూనే సొల్యూషన్ చెప్పే ప్రయత్నం చేశామని విక్రాంత్ పేర్కొన్నారు.
ఇటీవల ప్రదర్శించిన ప్రీమియర్షోలకు మంచి స్పందన లభించిందని, త్వరలో ఈ చిత్ర దర్శకుడు సంజీవ్రెడ్డితోనే ‘సర్పంచ్’ అనే సినిమా చేయబోతున్నానని, మృత్యుంజయ, మార్కండేయ అనే మరో సోషియోఫాంటసీ మూవీకి ప్రయత్నాలు జరుగుతున్నాయని విక్రాంత్ అన్నారు.