Vikram | దక్షిణాది సినీరంగంలో ప్రయోగాత్మక పాత్రల ద్వారా విలక్షణ నటుడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు అగ్ర హీరో విక్రమ్. ఆయన తాజా చిత్రం ‘తంగలాన్’కు మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ సందర్భంగా ఓ విజయోత్సవ సమావేశంలో పాల్గొన్న విక్రమ్ ‘బొంబాయి’ సినిమాలో తాను హీరోగా నటించే అవకాశాన్ని కోల్పోవడం ఎంతగానో బాధించిందని చెప్పారు. కల్ట్క్లాసిక్ నిలిచిన సినిమాను మిస్ చేసుకోవడం కెరీర్లో చేసిన పెద్ద తప్పిదమని విక్రమ్ అన్నారు. ‘మణిరత్నం వర్కింగ్ైస్టెల్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన డైరెక్షన్లో నటించిన తర్వాత ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నా ఫర్వాలేదు అనుకునేవాడిని. ఈ క్రమంలో ‘బొంబాయి’ సినిమాలో ఛాన్స్ వచ్చింది. హీరోగా నన్ను దాదాపు ఖరారు చేశారు.
అయితే ఆడిషన్ సందర్భంగా నేను చేసిన చిన్న తప్పిదం వల్ల సినిమా మిస్ అయింది. స్టిల్ కెమెరా నా ముందు పెట్టి సీన్లో నటించమని చెప్పారు. స్టిల్ కెమెరా ముందు యాక్ట్ చేయడమేంటి? అనే భావనతో నేను సీన్ చేయకుండా అలాగే ఉండిపోయా. దాంతో నన్ను తప్పించారు. ‘బొంబాయి’ జాతీయ స్థాయిలో కల్ట్క్లాసిక్గా నిలిచింది. ఆ సినిమా విడుదలైన తర్వాత రెండు నెలలు ఎంతో ఆవేదన చెందాను. రోజూ ఉదయం లేవగానే ఏడుస్తూ కూర్చునేవాణ్ణి’ అని విక్రమ్ తెలిపారు. ‘బొంబాయి’ సినిమా మిస్ అయినప్పటికీ.. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వం వహించిన ‘రావణ్’ ‘పొన్నియన్ సెల్వన్’ సిరీస్ చిత్రాల్లో విక్రమ్ కథానాయకుడిగా నటించారు.