‘ఘాటీ’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్నాడు తమిళ నటుడు విక్రమ్‌ప్రభు. అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శనివారం విక్రమ్‌ప్రభు పాత్రికేయులతో ముచ్చటించారు. దర్శకుడు క్రిష్ ఈ కథ చెప్పినప్పుడే చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించిందని, ఆయన క్రియేట్ చేసిన ‘ఘాటీ’ ప్రపంచం ప్రేక్షకులను థ్రిల్‌కి గురిచేస్తుందన్నారు. ‘అనుష్కగారికి నేను పెద్ద అభిమానిని. గతంలో ఆమెతో కలిసి నటించే ఛాన్స్ మిస్సయింది.
‘రుద్రమదేవి’ చిత్రంలో అల్లు అర్జున్ చేసిన గోన గన్నారెడ్డి పాత్రకు తొలుత నన్నే అడిగారు. కానీ అప్పుడు కుదరలేదు’ అన్నారు. ‘ఘాటీ’ చిత్రంలో తాను దేశిరాజు అనే పాత్రలో కనిపిస్తానని, ఉత్తరాంధ్ర నేపథ్యంలో నడిచే ఈ కథలో అక్కడి యాసలో మాట్లాడటం ఛాలెంజింగ్‌గా అనిపించిందని విక్రమ్ ప్రభు తెలిపారు. తెలుగులో తాను చిరంజీవి, నాగార్జునకు పెద్ద ఫ్యాన్‌నని, ఓ మంచి కథ ద్వారా తెలుగులో ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో తెలుగు చిత్రాలకు కూడా ప్రాధాన్యతనిస్తానని ఆయన పేర్కొన్నారు.