చియాన్ విక్రమ్ కథానాయకుడిగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ‘ధృవనక్షత్రం’. రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్నది. గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకుడు. రీతువర్మ కథానాయిక. ఈ చిత్రం తొలి భాగం ‘ధృవనక్షత్రం చాప్టర్ 1 యుద్ధకాండ’ ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా హేరిస్ జయరాజ్ స్వరాలందించిన ఈ చిత్రంలోని తొలిపాటను శనివారం మేకర్స్ విడుదల చేశారు. ‘కరిచే కళ్లే చూసి కుదేలయ్యానయ్యా.. గరుకు ఒళ్లే నన్ను లాగెనురా ’ అని సాగే ఈ పాటను రాకేందుమౌళి రాయగా, శ్రీలేఖ పార్థసారథి ఆలపించారు. మాస్ అంశాలే కాకుండా, సంగీత పరంగా కూడా ఈ చిత్రం అద్భుతంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఆర్.పార్తీబన్, బేగ్, సతీష్ కృష్ణన్, మాయ ఎస్.కృష్ణన్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ పరమహంస, ఎస్.ఆర్.కతీర్, విష్ణుదేవ్.