Vijayshanthi | స్టార్ హీరోల సరసన కథానాయికగా నటిస్తూనే అడపాదడపా లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో నటించి లేడి సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకుంది విజయశాంతి. అప్పట్లో స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. యాక్షన్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్‌గా కూడా మారింది. తెరపై ఖాకీ పాత్రలకే వన్నె తీసుకొచ్చిన విజయశాంతి యాక్షన్ సన్నివేశాల కోసం ఎలాండి డూప్ లేకుండా నటించేవారు. ఆమె వయసు 60కి సమీపిస్తున్నా కూడా అడపాదడపా సినిమాలలో నటిస్తూ మెప్పిస్తుంది. ఆ మధ్య మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించిన విజయశాంతి ఇప్పుడు అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రంలో నటించింది. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే విజయశాంతి తన కెరీర్లో ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణలతో కలిసి నటించింది. వీరి కాంబోలో వచ్చిన చాలా చిత్రాలు సూపర్ హిట్‌గా కూడా నిలిచాయి. అయితే ఇప్పుడు తిరిగి బాలకృష్ణ, చిరంజీవిలతో కలిసి నటించే ఛాన్స్ ఉందా అనే ప్రశ్న విజయశాంతికి ఎదురు కాగా, ఇకపై తాను వారితో సినిమాలు చేయనని సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది. ఎమ్మెల్సీగా ఎంపికైన నేపథ్యంలో బాధ్యతలు పెరిగాయి. ప్రజా కార్యక్రమాలతో బిజీగా ఉంటాం కాబట్టి మున్ముందు సినిమాలు చేసే అవకాశం ఉండదు. ఇక చిరంజీవి,బాలకృష్ణలతో నటించే అవకాశమే లేదు అని తేల్చేసింది లేడి సూపర్ స్టార్. విజయశాంతి.. చిరంజీవి కాంబోలో వచ్చిన గ్యాంగ్ లీడర్, యముడికి మొగుడు, స్వయం ఖుషి, పసివాడి ప్రాణం, కొండవీటి దొంగ, కొండవీటి రాజా, మెకానిక్ అల్లుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, మహానగరంలో మాయగాడు, స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్, రుద్రవీణ, మంచి దొంగ, సంఘర్షణ, దేవాంతకుడు, చాణక్య శపథం, యుద్దభూమి, ధైర్యవంతుడు, ఛాలెంజ్, చిరంజీవి, ధర్మయుద్దం చిత్రాలు మంచి విజయాలు సాధించాయి.
ఇక విజయశాంతి.. బాలయ్య కాంబోలో రౌడీ ఇన్స్పెక్టర్, లారీ డ్రైవర్, ముద్దుల మావయ్య, నిప్పురవ్వ, భార్గవ రాముడు, మువ్వ గోపాలుడు, అపూర్వ సహోదరులు, ముద్దుల కృష్ణయ్య, సాహస సామ్రాట్, భానుమతి గారి మొగుడు, ముద్దుల మేనల్లుడు, భలే దొంగ, ఇన్స్ పెక్టర్ ప్రతాప్, తల్లి తండ్రులు, దేశోద్ధారకుడు, పట్టాభిషేకం, రౌడీ రాణి, కథానాయకుడు, సంఘర్ష్ వంటి సినిమాలు రాగా, ఇందులో చాలా చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. మున్ముందు తాను సినిమాలు చేయనని విజయశాంతి స్టేట్ మెంట్ ఇవ్వడంతో అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రమే విజయశాంతికి చివరి చిత్రం అవుతుందా అనేది చూడాలి.